కోవిడ్‌-19 మరణాల వెనుక..

23 Apr, 2020 17:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సోకిన వారిని న్యూనతకు గురిచేసే పరిస్థితి ఆందోళనకరమని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులెరియా అన్నారు. కోవిడ్‌-19 నుంచి కోలుకున్న రోగులను అనుమానాస్పదంగా చూస్తూ వారిపై అపరాధ ముద్ర వేస్తున్నారని ఇది రోగులు, వారి కుటుంబ సభ్యుల్లో భయాందోళనలు కలిగిస్తోందని అన్నారు. తమపై సమాజం ఎలాంటి ముద్ర వేస్తుందో అనే భయంతో చాలామంది కోవిడ్‌-19 లక్షణాలు కలిగిన రోగులు ఆస్పత్రులను సంప్రదించకపోవడంతో అది మరణాలకు దారితీస్తోందని అన్నారు. పాజిటివ్‌ రోగులు చివరి దశలో ఆస్పత్రులకు వస్తుండటంతో మరణాల రేటు పెరుగుతోందని వివరించారు.

వీరిలో 95 శాతం మందికి ఆక్సిజన్‌ చికిత్సతో నయమవుతుందని, కేవలం 5 శాతం మందికి మాత్రమే వెంటిలేటర్లపై చికిత్స అవసరమవుతుందని అన్నారు. వైద్యులను సంప్రదించడంలో జాప్యం నెలకొనడంతో వ్యాధిని సకాలంలో గుర్తించలేక అధిక మరణాలు సంభవిస్తున్నాయని డాక్టర్‌ గులెరియా అన్నారు. కోవిడ్‌-19 రోగులను, వారి కుటుంబ సభ్యులపై అపరాధ ముద్రను వేయడం కంటే వారి పట్ల మనం సానుభూతి చూపించాల్సిన అవసరం ఉందని అన్నారు.

చదవండి : కరోనాపై పోరు: డాక్టర్‌ కన్నీటిపర్యంతం

పెద్దసంఖ్యలో ప్రజలు పరీక్షలకు తరలివచ్చేలా కోవిడ్‌-19 రోగుల పట్ల సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కరోనా వైరస్‌ సోకిన వారిలో 90 నుంచి 95 శాతం మంది సులభంగానే కోలుకునే అవకాశం ఉన్నందున ఇది ప్రాణాంతక వైరస్‌ కాదని, కానీ ఎవరేమనుకుంటారో అనే భయంతో దీన్ని గుర్తించడంలో జాప్యంతో రోగుల్లో అధిక మరణాలు సంభవిస్తున్నాయని డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు.

మరిన్ని వార్తలు