‘మా ఎన్నికలతో నీకేం పని’

11 Apr, 2019 13:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రధానిగా నరేంద్ర మోదీ తిరిగి ఎన్నిక అయితేనే భారత్‌-పాక్‌ మధ్య శాంతి చర్చలు సాగుతాయని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ తప్పుపట్టారు. భారత్‌లో ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా సాగుతాయని, పాకిస్తాన్‌లో ఎన్నికల ప్రక్రియ సైన్యం, నిఘా సంస్థల నియంత్రణలో ఉంటుందన్న సంగతి ఇమ్రాన్‌ గుర్తెరగాలన్నారు.

ఇమ్రాన్‌ ప్రకటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి నరేంద్ర మోదీ తిరిగి ప్రధాని కావాలని తాను కోరుతున్నానని ఆయన వ్యాఖ్యానించడం సరైంది కాదని స్పష్టం చేశారు. కశ్మీర్‌ ఏ ఒక్కరి ప్రైవేట్‌ ఆస్తి కాదని తాను ఇమ్రాన్‌కు గుర్తుచేస్తున్నానని ఓవైసీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఓవైసీ విలేకరులతో మాట్లాడుతూ ప్రధానిగా మోదీ మళ్లీ అధికారం చేపట్టాలని ఇమ్రాన్‌ ఖాన్‌, పాక్‌ ఐఎస్‌ఐ కోరుతున్నాయని, వారి ఆకాంక్షను భారత ప్రజలు నెరవేర్చబోరని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌ భారత్‌కు గుండెకాయ వంటిదని, అది దేశంలో అంతర్భాగమని ఓవైసీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు