అయోధ్య’పై రివ్యూ పిటిషన్‌ వేస్తాం

18 Nov, 2019 04:27 IST|Sakshi
ఏఐఎంపీఎల్‌బీ కార్యదర్శి జఫర్యాబ్‌ జిలానీ

మసీదు స్థలాన్ని ఎవరికీ ఇవ్వకూడదు: ఏఐఎంపీఎల్‌బీ

రివ్యూ పిటిషన్‌ వేయబోమన్న సున్నీ వక్ఫ్‌ బోర్డు

అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూపిటిషన్‌ దాఖలు చేస్తామని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్, జమీయత్‌  ఉలేమా ఎ హింద్‌ ప్రకటించాయి.  

లక్నో/న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి– బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేస్తామని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌(ఏఐఎంపీఎల్‌బీ), జమీయత్‌  ఉలేమా ఎ హింద్‌ ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డ్‌ మాత్రం సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయబోమన్నారు. వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించాలని, మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో వేరే చోట సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డ్‌కు 5 ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

ఆ ఐదు ఎకరాల స్థలాన్ని స్వీకరించాలా? వద్దా? అనేది నవంబర్‌ 26న జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ జుఫర్‌ ఫారూఖీ తెలిపారు. మసీదు స్థలాన్ని వదులుకోవడం షరియా ప్రకారం సరికాదని ఏఐఎంపీఎల్‌బీ పేర్కొంది.  ఏఐఎంపీఎల్‌బీ సమావేశం ఆదివారం లక్నోలో జరిగింది. మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాలు ఇస్తామన్న ప్రతిపాదనను అంగీకరించబోమని సమావేశం అనంతరం  ఏఐఎంపీఎల్‌బీ స్పష్టం చేసింది. ‘అది సరైన న్యాయం కాదు.. అలాగే, మాకు జరిగిన నష్టానికి పరిహారం కాబోదు’ అని స్పష్టం చేసింది.

‘ఈ కేసులో ఏఐఎంపీఎల్‌బీ పిటిషన్‌దారు కాదు. కానీ పిటిషన్‌దారులకు దిశానిర్దేశం చేస్తుంది. ముస్లింల తరఫు పిటిషన్‌దారుల్లో ఐదుగురు రివ్యూ వేసేందుకే మొగ్గు చూపారు’ అని ఏఐఎంపీఎల్‌బీ సభ్యుడు కమల్‌ ఫారూఖీ తెలిపారు. ‘మసీదు స్థలం అల్లాకు చెందుతుంది. షరియా ప్రకారం ఆ స్థలాన్ని ఎవరికీ ఇవ్వకూడదు’ అని ఏఐఎంపీఎల్‌బీ కార్యదర్శి జఫర్యాబ్‌ జిలానీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పలు పరస్పర విరుద్ధ అంశాలున్నాయన్నారు.

ఈ కేసులో తొలుత కేసు వేసినవారిలో ఒకరైన జమీయత్‌ సంస్థ ఉత్తరప్రదేశ్‌ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం సిద్దిఖీ కూడా సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేస్తామన్నారు. సాక్ష్యాలపైనో లేక హేతుబద్ధతపైననో ఆధారపడి తీర్పు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. అయోధ్య కేసులో ముఖ్య పిటిషనర్‌ అయిన ఇక్బాల్‌ అన్సారీ మాత్రం రివ్యూ పిటిషన్‌ వేసే ఆలోచన లేదన్నారు. ముస్లిం వర్గాల వాదనలను, అందించిన సాక్ష్యాధారాలను అంగీకరించిన సుప్రీంకోర్టు.. తీర్పు మాత్రం హిందువులకు అనుకూలంగా ఇచ్చిందని జమీయత్‌ సంస్థ అధ్యక్షుడు మౌలానా అర్షద్‌ మదానీ అన్నారు. సమావేశానికి ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా హాజరయ్యారు.
ఏఐఎంపీఎల్‌బీ కార్యదర్శి జఫర్యాబ్‌ జిలానీ

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు