రివ్యూనే కోరుకుంటున్నారు!

2 Dec, 2019 04:56 IST|Sakshi

అయోధ్య తీర్పుపై ఏఐఎంపీఎల్‌బీ

లక్నో: అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేయాలనే దేశంలోని 99 శాతం ముస్లింలు కోరుకుంటున్నారని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ (ఏఐఎంపీఎల్‌బీ) పేర్కొంది. రామజన్మభూమి– బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించి నవంబర్‌ 9న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీదును కూల్చిన స్థలంలో ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణం జరగాలని, మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే మరో చోట సున్నీ వక్ఫ్‌ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు  తీర్పునిచ్చింది.

అయితే, ముస్లింల తరఫు పిటిషన్‌దారు అయిన సున్నీ వక్ఫ్‌బోర్డు ఆ తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయబోమని స్పష్టం చేసింది. కానీ, ఏఐఎంపీఎల్‌బీ మాత్రం డిసెంబర్‌ 9న రివ్యూ పిటిషన్‌ దాఖలవుతుందని పేర్కొంది. తాజాగా, ఆదివారం ఏఐఎంపీఎల్‌బీ ప్రధాన కార్యదర్శి మౌలానా వాలి రహ్మానీ మాట్లాడుతూ.. ‘99% ముస్లింలు రివ్యూ పిటిషన్‌ వేయాలనే కోరుకుంటున్నారు. ముస్లింలకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు తరువాత.. వారిలో ఆ నమ్మకం తగ్గింది’ అని వ్యాఖ్యానించారు. రివ్యూ పిటిషన్‌ వేసినా.. ఆ పిటిషన్‌ను కొట్టేస్తారనే అనుమానం తమకుందన్నారు. పిటిషన్‌ వేయడం తమ హక్కు అని, సుప్రీంకోర్టు తీర్పులో వైరుద్ధ్యాలున్నాయన్నారు.

ఉద్రిక్తతలు సృష్టించాలనే..
అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయాలన్న నిర్ణయాన్ని కేంద్రమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తప్పుబట్టారు. పిటిషన్‌ వేయడం ద్వారా సమాజంలో విభజనపూరిత, ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడేలా చేయాలనుకుంటున్నాయని ఏఐఎంపీఎల్‌బీ, జమాయిత్‌ సంస్థలపై మండిపడ్డారు.  ‘ముస్లింలు బాబ్రీని కాదు.. ఆర్థికంగా, సామాజికంగా సమానత్వం కోరుకుంటున్నార’న్నారు.

ఆర్థికంపై దృష్టిపెట్టండి
రివ్యూ పటిషన్‌ వేయాలన్న నిర్ణయాన్ని గతంలో అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వం వహించిన శ్రీశ్రీ రవిశంకర్‌ కూడా తప్పుబట్టారు. ఆ వివాదాన్ని మర్చిపోయి, హిందూ, ముస్లింలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు