ప్రధాని మోడీరాకతో ఎయిమ్స్‌లో ఇబ్బందులు

24 Aug, 2014 23:25 IST|Sakshi

 న్యూఢిల్లీ: సాధారణ వైద్య పరీక్షల కోసం ప్రధాని మోడీ ఆదివారం ఎయిమ్స్‌కు రావడంతో రోగులు, సిబ్బంది ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఉదయం 10.30 గంటలకు మోడీ ఆస్పత్రికి వచ్చారని, వైద్య పరీక్షల అనంతరం ఆయన వెంటనే తిరిగి వెళ్లిపోయారని ఎయిమ్స్ డెరైక్టర్ ఎం.సి. మిశ్రా తెలిపారు. ఇదిలాఉండగా ఆయన రాకవల్ల ఎయిమ్స్ పరిసరాల్లో భద్రతా ఆంక్షలు విధించారు. ఆస్పత్రికి ఆయన రావడానికి అరగంట ముందు నుంచి బయటివారిని ఎవరినీ లోపలికి అనుతించలేదు.

కొంతమంది ఆస్పత్రి సిబ్బందిని కూడా లోపలికి వెళ్లనివ్వలేదు. ఇక వైద్యం కోసం వచ్చిన రోగులనైతే గేటు వద్దే ఆపివేశారు. ఆస్పత్రి మొత్తాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్న భద్రతా సిబ్బంది వైద్య పరీక్షలు ముగిసే వరకు కఠినంగా వ్యవహరించారు. ఈ విషయమై ఓ రోగి మాట్లాడుతూ... ‘ప్రధానికి భద్రత కల్పించడం అవసరమే. అయితే ఈస్థాయి భద్రతను గతంలో కూడా ఎప్పుడూ చూడలేదు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారిని కూడా లోపలికి పంపకపోతే ఎలా? సిబ్బంది కూడా బయటే నిల్చోవాల్సి వచ్చింది.

 ఇలా ప్రజలను ఇబ్బందిపెడితే ఎలా?’ అని ప్రశ్నించారు. ఆస్పత్రి సిబ్బంది ఒకరు మాట్లాడుతూ... ‘ఆస్పత్రి సిబ్బంది అని కూడా చూడలేదు. ఐడీ కార్డులు చూపినా కూడా లోపలికి వెళ్లనివ్వలేదు. మా సంగతి సరే... రోగులను కూడా లోపలికి పంపకపోతే ఎలా? వారిలో హృద్రోగులు, గర్భవతులు ఉన్నారనే కనికరం లేకపోతే ఎలా?’ అని ప్రశ్నిం చారు. మోడీ రాకతో రోగులు ఇబ్బంది పడిన వార్తలు టీవీలో ప్రసారమైన వెంటనే ట్విటర్, ఫేస్‌బుక్‌లో కూడా విమర్శలు వెల్లువెత్తాయి.

మరిన్ని వార్తలు