ఎంత మంది చచ్చారో లెక్కించలేదు : బీఎస్‌ ధనోవా

4 Mar, 2019 13:25 IST|Sakshi

కోయంబత్తూరు : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మెరుపు దాడులు జరిపిన విషయం తెలిసిందే. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారత్‌లోని రాజకీయం ఈ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చుట్టే తిరుగుతోంది. ఈ దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో లెక్క చెప్పాలని, వాటికి ఆధారాలు ఇవ్వాలని ప్రతిపక్షపార్టీలు ప్రశ్నిస్తుండగా..  250 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని అధికార పార్టీ పేర్కొంది. ఇక భారత వాయుసేన ఐఏఎఫ్‌ చీఫ్‌ బీఎస్‌ ధనోవా మాత్రం ఈ మెరుపు దాడుల్లో ఎంత మంది చచ్చారో లెక్కించలేదని తెలిపారు. భారత వాయుసేన ఆ పనిచేయలేదని పేర్కొన్నారు.

‘ఎంత మంది చనిపోయారనేది లెక్కించలేం. అది అక్కడ ఎంత మంది ఉన్నారనే సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. మృతుల సంఖ్యను లెక్కించడం భారత వాయుసేన పనికాదు. దాడి చేయడమే మా పని. ఆ లెక్కలు ప్రభుత్వం చూసుకుంటుంది. బాల్‌కోట్‌లోని ఉగ్రస్థావరాలను మాత్రం ధ్వంసం చేశాం.’ అని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 26న భారత వాయుసేన పాకిస్తాన్‌లోని బాలకోట్‌పై మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు