విమానం జాడపై తొలగని ఉత్కంఠ

5 Jun, 2019 04:28 IST|Sakshi

కొనసాగుతున్న గాలింపు చర్యలు

ఈటానగర్‌/న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్‌–32 రకం రవాణా విమానం ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాయుసేన విమానం జాడ కనిపెట్టేందుకు మంగళవారం భారతీయ నేవీ కూడా రంగంలోకి దిగింది. మొత్తం 13 మందితో వెళ్తున్న ఏఎన్‌–32 విమానం అస్సాంలోని జోర్హత్‌ నుంచి టేకాఫ్‌ అయిన 33 నిమిషాలకే అదృశ్యమైన విషయం తెలిసిందే. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెచుకా ప్రాంతానికి చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే గల్లంతైంది. అదృశ్యమైన విమానాన్ని వెతికేందుకు శక్తివంతమైన పీ8ఐ విమానం తమిళనాడులోని ఎర్నాకులంలో ఉన్న ఐఎన్‌ఎస్‌ రాజలీ నుంచి మంగళవారం మధ్యాహ్నం బయలుదేరిందని నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్‌ డీకే శర్మ వెల్లడించారు.

ఇది ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్ల సాయంతో గాలింపు చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇప్పటికే ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు ఎంఐ–17 విమానాలు, అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌లు విమానం కోసం మెంచుకా అటవీ ప్రాంతంలో గాలిస్తున్నాయని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో కొంతమంది బృందాలుగా ఏర్పడి విమానం జాడ కోసం వెతుకుతున్నాయని తెలిపారు. సోమవారం ఓ చోట విమానం కూలిపోయినట్లు తమకు సమాచారం అందిందని.. వెంటనే అక్కడకు వెళ్లి పరిశీలించగా అలాంటిదేం లేదని గుర్తించామని భారత వైమానిక దళం ఒక ప్రకటనలో వెల్లడించింది.  

అస్సాంకు చేరిన ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ కుటుంబసభ్యులు
పటియాలా: అదృశ్యమైన విమానంలో ఎనిమిది మంది వైమానిక సిబ్బంది సహా ఐదుగురు ప్యాసింజర్లు ఉన్నారని తెలిపింది. వీరిలో పటియాలాలోని సమానా ప్రాంతానికి చెందిన ఫ్లైట్‌ లెఫ్లినెంట్‌ మోహిత్‌ గార్గ్‌ కూడా ఉన్నారు. విమానం గల్లంతైన వార్త తెలియగానే మోహిత్‌ తండ్రి సురీందర్‌ గార్గ్, అంకుల్‌ రిషీ గార్గ్‌ అస్సాంకు చేరుకున్నారని వారి కుటుంబసభ్యులు వెల్లడించారు. మోహిత్‌ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు అతని సోదరుడు అశ్వనీ గార్గ్‌ తెలిపారు. మోహిత్‌కు గతేడాది వివాహమైంది. అతని భార్య అస్సాంలోని ఓ బ్యాంకులో పనిచేస్తోంది.   

పదేళ్ల క్రితమూ ఇలాగే..
అది 2009 సంవత్సరం జూన్‌ నెల. భారత వాయుసేనకు చెందిన ఏఎన్‌–32 రకం రవాణా విమానం 13 మందిని ఎక్కించుకుని వెళ్తుండగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో కూలిపోయింది. అందులోని మొత్తం 13 మంది మరణించారు. పశ్చిమ సియాంగ్‌ జిల్లాలోని రించీ హిల్‌పైన ఆ విమానం కూలిపోయింది. ఆ విమానం మెచుకా నుంచి అసోంలోని మోహన్‌బరి వైమానిక స్థావరానికి వెళ్తుండగా మెచుకాకు 30 కిలోమీటర్ల దూరంలో దుర్ఘటన జరిగింది. విచిత్రం ఏమిటంటే సరిగ్గా పదేళ్లకు జూన్‌ నెలలోనే 13 మందితో మెచుకా వెళ్తున్న ఏఎన్‌–32 రకం విమానం సోమవారం కన్పించకుండా పోయింది. ఇందులో కూడా 13 మందే ఉండటం గమనార్హం. ఈ విమానం మెచుకాకు వెళుతుండగా అదృశ్యం కావడం విశేషం.

మరిన్ని వార్తలు