‘ఎంఐ 17 వీ5 హెలికాఫ్టర్‌ కూల్చివేత తప్పిదమే’

4 Oct, 2019 14:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత వైమానిక దళం ఫిబ్రవరి 27న ఎంఐ-17 వీ5 హెలికాఫ్టర్‌ను కూల్చడం భారీ తప్పిదమని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ రాకేష్‌ కుమార్‌ సింగ్‌ భదౌరియా అన్నారు. ఎల్‌ఓసీ వద్ద భారత్‌, పాకిస్తాన్‌ యుద్ధ విమానాలు కాల్పులు జరిపిన రోజు జరిగిన ఈ ఘటనలో ఆరుగురు వాయుసేన సిబ్బంది, ఓ పౌరుడు మరణించిన సంగతి తెలిసిందే. ఇది తమ పొరపాటేనని, దీన్ని తాము అంగీకరించామని ఎయిర్‌ చీఫ్‌ స్పష్టం చేశారు. మన క్షిపణే యుద్ధ విమానాన్ని ఢీ కొందని, ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు అధికారులపై చర్యలు చేపడతామని చెప్పారు. గత వారంలో ఈ ఘటనపై విచారణ జరిగిందని, దీనిపై నిర్వహణపరమైన క్రమశిక్షనా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పారు. బాలాకోట్‌లో ఐఎఎఫ్‌ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించిన మరుసటి రోజు శ్రీనగర్‌ సమీపంలోని బుద్గాం వద్ద ఎంఐ17 వీ5 హెలికాఫ్టర్‌ కూలిన సంగతి తెలిసిందే. ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను పర్యవేక్షించిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో హెలికాఫ్టర్‌ టేకాఫ్‌ అయిన పది నిమిషాలకే కుప్పకూలింది. రెండు ముక్కలైన ఎంఐ-17 హెలికాఫ్టర్‌ వెనువెంటనే మంటల్లో చిక్కుకుంది. కాగా, బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడి దృశ్యాల వీడియోను ఎయిర్‌ చీప్‌ భదౌరియా విడుదల చేశారు.

మరిన్ని వార్తలు