పార్టీలో విషాదం.. ఎయిర్ హోస్టెస్ మృతి

16 Aug, 2017 22:43 IST|Sakshi
పార్టీలో విషాదం.. ఎయిర్ హోస్టెస్ మృతి

కోల్‌కతా: పుట్టినరోజు వేడుకలకు హాజరైన ఓ ఎయిర్ హోస్టెస్ శవంగా మారడం స్థానికంగా కలకలం రేపింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి కోల్‌కతా పోలీసులు విచారణ చేపట్టారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. షిల్లాంగ్‌కు చెందిన క్లారా ఖాంగ్‌సిట్ (22) ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్ గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కొందరు మిత్రులతో కలిసి ఓ ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు మంగళవారం రాత్రి హాజరైంది.

స్నేహితులతో కలిసి క్లారా హుషారుగా పార్టీ చేసుకుంది. ఏమైందో తెలియదు కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్తు కిటికీ నుంచి కింద పడిపోయి క్లారా మృతిచెందింది. బుధవారం ఉదయం స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఎయిర్ హోస్టెస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అపార్ట్‌మెంట్లో ఉన్న క్లారా ఫ్రెండ్స్ ఇద్దరిని పోలీసులు విచారించారు. ఎయిర్‌లైన్స్ అధికారులను సంప్రదించగా.. పోలీసుల విచారణలో నిజాలు వెల్లడవుతాయన్నారు. అయితే క్లారా ఆత్మహత్య చేసుకుందా.. లేక పార్టీ తర్వాత గొడవ జరిగి ఎవరైనా ఆమెను హత్య చేశారా అనే కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు