బ్లాక్‌ లిస్టులో శివసేన ఎంపీ

24 Mar, 2017 13:02 IST|Sakshi
బ్లాక్‌ లిస్టులో శివసేన ఎంపీ

ముంబై: ఎయిర్‌ ఇండియా సిబ్బందిపై భౌతికంగా దాడి చేసిన శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్‌ను  బ్లాక్‌లిస్టులో పెట్టినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఎయిర్‌ ఇండియాకు చెందిన డ్యూటీ మేనేజర్‌ను 25 సార్లు చెప్పుతో కొట్టినందుకు అతనిపై కంపెనీ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా అతన్ని ఆ సంస్థ బ్లాక్‌లిస్టులో చేర్చింది.  అయితే  ఈ నిషేధం ఎన్ని రోజుల వరకు కొనసాగుతుందనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. 

మరోవైపు గైక్వాడ్‌ పేరును బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ భావిస్తోంది. ప్రస్తుతం ఎఫ్‌ఐఏ పరిదిలో జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇండిగో, స్పైస్‌ జెట్‌, గో ఎయిర్‌ సంస్థలు సేవలందిస్తున్నాయి. అంటే గైక్వాడ్‌ పేరు బ్లాక్‌ లిస్ట్‌లో పెడితే ఆయన ఈ నాలుగు సంస్థల విమానాల్లో ప్రయాణించే అవకాశం కోల్పోతారు. కాగా ఎఫ్‌ఐఏ నుంచి ఎయిర్‌ఇండియా ఇటీవలే బయటకు వచ్చేసింది.

కాగా భారతీయ విమాన సంస్థలు సిబ్బంది భద్రత దృష్ట్యా అసభ్యంగా ప్రవర్తించేవారిని బ్లాక్‌లిస్టులో పెట్టే నియమం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎవరిని బ్లాక్‌లిస్టులో చేర్చలేదు. బ్లాక్‌ లిస్టులో నిలిచిన తొలి వ్యక్తిగా ఎంపీ గైక్వాడ్‌ నిలిచారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ  గైక్వాడ్‌ మాత్రం ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.  ఎయిర్‌ ఇండియా సిబ్బంది తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోనే అలా చేశానని ఆయన మీడియాకు చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, ఎయిర్‌ ఇండియా మేనేజరే తనకు ఎదురు క్షమాపణ చెప్పాలని గైక్వాడ్‌ డిమాండ్‌ చేశారు. బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ కలిగిన తనకు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణ సదుపాయం కల్పించారన్న ఆవేశాన్ని ఆపుకోలేక ఎంపీ నిన్న పుణె-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో డ్యూటీ మేనేజర్‌పై చెప్పుతో దాడి చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా గైక్వాడ్‌ను శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రే ఆదేశించారు.

మరిన్ని వార్తలు