ఆ సీనియర్ లీడర్ ను వీఐపీలా చూడలేదు

21 Mar, 2016 18:14 IST|Sakshi

న్యూఢిల్లీ: సీనియర్ నాయకుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఎక్కిన ఎయిరిండియా విమానం 14 గంటలు ఆలస్యంగా బయలుదేరినా.. ఎయిరిండియా అధికారులు ఆయనను కనీసం పట్టించుకోలేదు. ఆయనను వీఐపీలా పరిగణించి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. దీనిపై ఏచూరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎయిరిండియా తనకు కనీసం ఆతిథ్య మర్యాదలు ఇవ్వలేదని, విమానాల్లో ప్రయాణికులతో ఎలా వ్యవహరించాలో ఇప్పటికీ ఆ సంస్థ తెలుసుకోలేదని ఆయన అన్నారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎయిరిండియా 701 విమానంలో ఆదివారం రాత్రి ఏచూరి ఎక్కారు. అయితే ఈ విమానం 14 గంటలు ఆలస్యంగా ఢిల్లీకి చేరింది. ఎయిరిండియా విమానం జాప్యంతో తనకు ఎదురైన అనుభవాన్ని ఏచూరి వివరిస్తూ.. 'నేను మళ్లీ పార్టీ ఆఫీసుకు వెళ్లి అక్కడ డిన్నర్ చేయాల్సి వచ్చింది. మా పార్టీ కారు వచ్చేవరకు నేను ఎయిర్ పోర్టులోనే వేచి చూసాను. మరో అంతర్జాతీయ విమానంలో నాలుగు సీట్లు ఉన్నాయి. కానీ, పాకిస్థాన్ ప్రయాణికులు కనెక్టింగ్ విమానం ద్వారా అంతర్జాతీయ ఫ్లయిట్ ను అందుకోవాల్సి ఉండటంతో వారికోసం స్వచ్ఛదంగా ఆ సీట్లను వదులుకున్నాను. ఎట్టకేలకు సోమవారం ఉదయం టికెట్ బుక్కయింది. ఇది జరిగింది' అని ఏచూరి వివరించారు.

గతంలోనూ వీఐపీల పట్ల ఎయిరిండియా ఇలాగే వ్యవహరించిందని, తనను, పాకిస్థాన్ హైకమిషనర్ ను, ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ చూడటానికి వచ్చిన పాక్ ఆతిథులను ఇలాగే అవమానించిందని ఆయన పేర్కొన్నారు. అయితే సాంకేతికలోపంతోనే ఈ విమాన ప్రయాణంలో జాప్యం తలెత్తిందని ఎయిరిండియా చెప్తోంది.
 

మరిన్ని వార్తలు