టేకాఫ్‌ అవుతూ గోడను ఢీకొట్టింది

13 Oct, 2018 04:23 IST|Sakshi
విమానం ఢీకొనడంతో దెబ్బతిన్న గోడ, ధ్వంసమైన విమానం కింది భాగం

సాక్షి ప్రతినిధి, చెన్నై: తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్‌ విమానానికి భారీ ముప్పు తప్పింది. తిరుచ్చి నుంచి గురువారం అర్ధరాత్రి 1.30 గంటలప్పుడు దుబాయ్‌ వెళ్లేందుకు ఎయిరిండియాకు చెందిన ఐఎక్స్‌–611 విమానం బయలుదేరింది. టేకాఫ్‌ అవుతుండగా.. పైలట్లకు ల్యాండింగ్‌ సమయంలో సూచనలు ఇచ్చేందుకు విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఓ పెద్ద పరికరాన్ని విమానం ఢీకొంది. ఆ తర్వాత విమానం ప్రహరీ గోడను కూడా స్వల్పంగా తాకింది. ఈ ఘటనలతో విమానం కుదుపులకులోనై ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అటు విమానం చక్రం, ముందుభాగం స్వల్పంగా ధ్వంసమయ్యాయి. 50 అడుగుల ఎత్తున్న ప్రహారీ గోడ, దానిపై ఉన్న కంచె కూడా దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన సమయంలో విమానంలో 130 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా ఎవ్వరికీ ఏమీ కాలేదు.

విమానంలో కూడా అన్ని పరికరాలూ సవ్యంగానే పనిచేస్తున్నాయనీ, ఇబ్బందేమీ లేదని పైలట్లు చెప్పడంతో విమానం అలాగే దుబాయ్‌ వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని దుబాయ్‌ విమానాశ్రయానికి చేరవేయడంతో విమానం దెబ్బతిన్నందున తాము ల్యాండింగ్‌కు అనుమతించబోమని అక్కడి అధికారులు తేల్చి చెప్పారు. దీంతో విమానాన్ని తెల్లవారుజామున 5.45 ప్రాంతంలో ముంబైకి తరలించి, అక్కడ ప్రయాణికులను మరో విమానంలోకి ఎక్కించి 10.40 గంటలకు దుబాయ్‌కి పంపారు. ప్రమాదానికి కారణం సాంకేతిక సమస్యనా లేక పైలట్ల నిర్లక్ష్యమా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) విచారణకు ఆదేశించిందనీ, దర్యాప్తు పూర్తయ్యే వరకు పైలట్లను ఎయిరిండియా విధుల నుంచి తప్పించిందని తిరుచిరాపల్లి విమానాశ్రయ డైరెక్టర్‌ గుణశేఖరన్‌ చెప్పారు.
 

మరిన్ని వార్తలు