మాంసం కూడా పెడతాం

26 Dec, 2015 19:03 IST|Sakshi
మాంసం కూడా పెడతాం

న్యూఢిల్లీ: దేశీయ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు అందించే ఆహార పదార్థాల పట్టికలో మాంసాహార భోజనాన్ని తొలగించినట్టు వచ్చిన వార్తలను ఎయిర్‌ ఇండియా ఖండించింది. దీనిపై సంస్థ అధికారులు శనివారం వివరణ ఇచ్చారు. ప్రయాణ సమయం గంట నుంచి గంటన్నర వ్యవధి గల ఎయిరిండియా విమానాల్లో శాకాహారం మాత్రమే ఉంటుందని, ఇకపై మాంసాహార భోజనం ఉండబోదంటూ కథనాలు రావడంతో గందరగోళం నెలకొంది.  అయితే, ఇది సరికాదని.. శాకాహారంతో పాటు మాంసాహారం కూడా వడ్డిస్తామని ఎయిరిండియా స్పష్టం చేసింది. అంతేకాక మధ్యాహ్న భోజనం, డిన్నర్‌ సమయాల్లో టీ, కాఫీలను జనవరి 1 నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు వచ్చిన వార్తలను కూడా కొట్టిపారేసింది.

శీతాకాలం దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం వేడివేడి ఆహారపదార్థాలను అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. అది కూడా 90 నిమిషాల లోపు ప్రయాణ వ్యవధిగల విమానాల్లో మాత్రమే ఈ సౌకర్యాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇంతకముందు దేశీయ విమానాల్లో చల్లని శాకాహారం ఉండేదనీ, ఇప్పుడు వేడి శాకాహారాన్ని అందిస్తున్నామని వెల్లడించారు. జూనియర్‌ విమానయాన శాఖ మంత్రి మహేశ్‌ శర్మ మాట్లాడుతూ.. ఫలహారాలు మినహాయించి.. పాత ఆహార పట్టికలో ఎలాంటి మార్పులు చేయలేదని కేవలం సౌకర్యాలను మాత్రమే అభివృద్ధి చేశామని తెలిపారు.

మరిన్ని వార్తలు