ఎయిరిండియాకు సాఫ్ట్‌వేర్‌ షాక్‌

28 Apr, 2019 04:45 IST|Sakshi
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్న ఎయిర్‌ఇండియా ప్రయాణికులు

155 విమానాలకు అంతరాయం

తీవ్ర ఇబ్బందులపాలైన వేలాది మంది ప్రయాణికులు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ‘ఎయిరిండియా’ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వేలాది మంది ప్రయాణికుల సహనాన్ని పరీక్షించింది. శనివారం వేకువజాము నుంచి ఉదయం వరకు 155 విమాన సర్వీసులు ఆలస్యం కావడంతో దేశ, విదేశాల్లో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. శనివారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఎయిరిండియా చెక్‌–ఇన్‌ సాఫ్ట్‌వేర్‌లో సమస్య కారణంగా ప్రయాణికుల గుర్తింపు, బ్యాగేజి, రిజర్వేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. ఫలితంగా, దేశ, విదేశాల్లోని ఎయిరిండియా సిబ్బంది ప్రయాణికులకు బోర్డింగ్‌ పాస్‌ జారీ చేయలేకపోయారు. దీంతో ఇందుకు అవసరమైన పాసింజర్‌ సర్వీస్‌ సిస్టం(పీఎస్‌ఎస్‌) సేవలందించే అమెరికాలోని అట్లాంటాకు చెందిన ‘సిటా’ సంస్థను సంప్రదించారు.

ఆ సంస్థ యంత్రాంగం లోపాన్ని సరిదిద్దటానికి దాదాపు ఐదుగంటల సమయం తీసుకుంది. అనంతరం 8.45 గంటలకు ఎయిరిండియా తిరిగి సర్వీసులను పునరుద్ధరించింది. ఈ విషయమై ఎయిరిండియా చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ) అశ్వనీ లొహానీ మాట్లాడుతూ.. ‘సాఫ్ట్‌వేర్‌ సమస్యలో లోపంపై సిటా విచారణ జరుపుతోంది. సాఫ్ట్‌వేర్‌ షట్‌డౌన్‌కు వైరస్‌నా లేక మరేదైనా కారణమా తెలుసుకునేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు’ అని ఆయన తెలిపారు. ‘ఎక్కడ లోపం తలెత్తినా మేం పీఎస్‌ఎస్‌ వ్యవస్థను వాడుకుంటాం. కానీ, పీఎస్‌ఎస్‌లోనే సమస్య వచ్చింది. అందుకే వేరే మార్గాల్లో ప్రయాణికులకు వెంటనే సమాచారం అందించలేకపోయాం’ అని ఆయన వివరించారు.
 

మరిన్ని వార్తలు