ఎగిరి వెళ్తే ఎంత బాగుంటుంది!

22 Jan, 2019 02:54 IST|Sakshi

ఉబర్‌ ఎయిర్‌ యాప్‌లో బుక్‌ చేయగానే 5 నిమిషాల్లో ఎయిర్‌ ట్యాక్సీ వస్తుంది

పెద్ద భవనాలపై ఏర్పాటు చేసే పికప్‌ / డ్రాపింగ్‌ పాయింట్‌

ఎగిరే ట్యాక్సీలు.. అదిగో అప్పుడొచ్చేస్తున్నాయి.. ఇదిగో ఇప్పుడొచ్చేస్తున్నాయి అనే మాటలు తప్ప.. ఎప్పుడన్న దానిపై స్పష్టత లేదు. ఉబర్‌ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. 2023 సరికి తాము ఉబర్‌ఎయిర్‌ ట్యాక్సీలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. తొలుత అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్, డాలస్‌లలో ఈ సర్వీసులను ప్రవేశపెడతామని.. తర్వాత మిగతా నగరాలకు విస్తరిస్తామని తెలిపింది. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యలకు ఈ ఎగిరే ట్యాక్సీలే పరిష్కారమని చెబుతున్న ఉబర్‌..ప్రస్తుతం వాటి కోసం ఐదు కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది.
ఇంతకీ ఏమిటీ ఉబర్‌ ఎయిర్‌..ఎలా ఉండబోతోంది.. వివరాలివిగో..

ఈ ఫ్లయింగ్‌ ట్యాక్సీలకు విమాన ఇంధనంతో పనిలేదు. ఇవి ఎలక్ట్రిక్‌వి. సింగిల్‌ చార్జింగ్‌తో 100 కి.మీ దూరం ప్రయాణించగలవు. 5 నిమిషాల్లో మళ్లీ చార్జ్‌ అయిపోతాయి. అత్యధిక వేగం 320 కి.మీ. ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు. భారీగా కాకున్నా పరిమిత స్థాయిలో లగేజీ పెట్టుకునే సదుపాయం ఉంది. వెయ్యి నుంచి 2 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలవు. ఎత్తైన భవనాలు, షాపింగ్‌ మాల్స్‌ వంటివాటిపై ఏర్పాటు చేసే పికప్‌ పాయింట్ల నుంచి ప్రయాణికులను తీసుకెళ్తాయి.

ఇలాంటి తరహాలోనే ఏర్పాటు చేసే డ్రాపింగ్‌ పాయింట్ల వద్ద దింపుతాయి. నగరం స్థాయిని బట్టి 50 నుంచి 300 ఎగిరే ట్యాక్సీలను అందుబాటులో ఉంచుతారు. తొలుత మాజీ కమర్షియల్‌ పైలట్లతో వీటిని నడిపిస్తారు. తదనంతర దశలో అదనపు పైలట్లను నియమించుకుని.. శిక్షణ ఇస్తారు. ఎయిర్‌ ట్యాక్సీ అనేసరికి ఇదేదో డబ్బున్నోళ్ల వ్యవహారమని అనుకునేరు.. ఉబర్‌ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం అమెరికా తదితర దేశాల్లో మామూలు ఉబర్‌ ట్యాక్సీలో 40 కి.మీ. ప్రయాణానికి మన కరెన్సీలో రూ.4,200 అవుతుందని అనుకుంటే.. ఉబర్‌ ఎయిర్‌లో అదే దూరానికి రూ.6,500 అవుతుందట. కొన్నేళ్లలో అమెరికాకు..మరికొన్నేళ్లలో మన వద్దకు.. సూపర్‌ కదూ..  
- సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు