విమానంలో భారీగా బంగారం

28 Dec, 2016 02:58 IST|Sakshi

కేకే.నగర్‌(చెన్నై): ముంబై నుంచి చెన్నైకు వచ్చిన విమానంలో రూ.14.5 కోట్ల విలువైన 45 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్న అధికారులు ముగ్గురిని అరెస్టు చేశారు. ముంబై నుంచి గో ఎయిర్‌ ప్రైవేట్‌ విమానం మంగళవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకుంది. ఇందులో వచ్చిన అమీర్‌ కొత్తార్‌ (42), సచిన సోవి (36), ఎత్తిరాజులు (48) అనే ముగ్గురిని అధికారులు తనిఖీలు చేయగా వీరి వద్ద 45 కిలోల బంగారు నగలు ఉన్నట్టు గుర్తించారు. వీరిని విచారించగా తాము ముంబైకు చెందిన హోల్‌సేల్‌ నగల వ్యాపారులమని ఈ బంగారు నగలను చెన్నైలోని వ్యాపారులకు విక్రయించడానికి తీసుకొచ్చినట్లు తెలిపారు. సరైన ఆధారాలు చూపకపోవడంతో నగలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు.

వ్యాపారి లోధా ఇళ్లల్లో ఈడీ సోదాలు  
కోల్‌కతా: పెద్దనోట్ల రద్దు దరిమిలా వెలుగుచూసిన రెండు అతిపెద్ద నల్లధన కేసుల విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మంగళవారం కోల్‌కతా, ఢిల్లీలోని వ్యాపారి పరాస్‌ మాల్‌ లోధా ఇళ్లల్లో సోదాలు జరిపింది. ఆయన్ని ఈడీ గతవారమే ఢిల్లీలో అరెస్టుచేసి కస్టడీలో ఉంచింది. ఢిల్లీకి చెందిన న్యాయవాది రోహిత్‌ టాండన్‌ సంస్థ, చెన్నై గనుల వ్యాపారి జె. శేఖర్‌ రెడ్డిల నుంచి కొత్తనోట్ల రూపంలో భారీగా నగదు స్వీకరించిన కేసులకు సంబంధించి లోధా అరెస్టయ్యారు.

టాండన్‌ సంస్థ నుంచి దర్యాప్తు సంస్థలు ఈ నెల ఆరంభంలో రూ.13.6 కోట్ల నగదు పట్టుకున్నాయి. రెడ్డికి సంబంధించిన కేసులో చెన్నైలో ఐటీ అధికారులు రూ.142 కోట్ల పైబడిన విలువైన అప్రకటిత ఆదాయాన్ని గుర్తించారు. నోట్ల రద్దు తరువాత ఈడీ చేపట్టిన నల్లధన వ్యతిరేక ఆపరేషన్లలో ఈ రెండు కేసులను చేర్చారు. ఈడీ, ఐటీ, సీబీఐ, ఢిల్లీ పోలీసులు వీటిపై దర్యాప్తుచేస్తున్నాయి.

మరిన్ని వార్తలు