‘విమాన దాదా’లపై కొరడా

9 Sep, 2017 02:02 IST|Sakshi
‘విమాన దాదా’లపై కొరడా

► దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికులపై కఠినచర్యలు
► 3 నెలల నుంచి జీవితకాల నిషేధం
► తొలిసారిగా ‘నో ఫ్లై’ మార్గదర్శకాలు
► రూపొందించిన కేంద్రం


న్యూఢిల్లీ: విమానయాన సంస్థల సిబ్బందిపై తరచూ దాడులు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులపై మూడు నెలల నుంచి జీవిత కాలంపాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాలని నిర్ణయించినట్టు శుక్రవారం ప్రకటించింది. తొలిసారిగా ‘నో ఫ్లై’జాబితాకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించింది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సత్ప్రవర్తన లేని ప్రయాణికుల జాబితాను సిద్ధం చేసింది.

ప్రయాణికుల దురుసు ప్రవర్తనను మూడు రకాలుగా విభజించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. తీవ్రతను బట్టి ఒక్కోదానికి ఒక్కో కాలపరిమితిగల శిక్షను ఖరారు చేసింది. ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బిజినెస్‌ క్లాస్‌లో తనకు సీటు ఇవ్వలేదని శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ ఎయిర్‌ ఇండియా ఉద్యోగిని 25సార్లు చెప్పుతో కొట్టిన నేపథ్యంలో దుష్ప్రవర్తన గల ప్రయాణికులతో ‘నో ఫ్లై’జాబితా రూపొందించాలని విమానయాన సంస్థలు కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది.  

ప్రయాణించే సమయంలోనే...
భద్రతా ప్రమాణాల్లో భాగంగా ప్రపంచంలో ‘నో ఫ్లై’జాబితా రూపొందిస్తున్న మొట్టమొదటి దేశం భారత్‌ అని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా చెప్పారు. అయితే విమానంలో ప్రయాణించేటప్పుడు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు. ఈ సమయంలో ప్రయాణికుడి దురుసు ప్రవర్తన వల్ల విమానం, అందులోని వారి భద్రతకు విఘాతం కలిగితే తీవ్రతను బట్టి నిషేధం ఉంటుందన్నారు. ఇతర సమయాల్లో జరిగే ఘటనలపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తాయన్నారు. ఓ దేశీయ విమానయాన సంస్థ ‘నో ఫ్లై’జాబితాకు ఇతర సంస్థలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఒక సంస్థ నిషేధించిన ప్రయాణికుడి విషయంలో నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ ఇతర విమాన సంస్థలకు ఉందని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు అన్ని దేశీయ, విదేశీ విమాన సేవలకు, అన్ని విమానాశ్రయాలకూ వర్తిస్తాయన్నారు. ‘వీటన్నింటి ముఖ్య ఉద్దేశం విమానం ఎక్కిన తరువాత పూర్తి స్థాయిలో భద్రత కల్పించడం’అని సిన్హా తెలిపారు. ప్రభుత్వ ‘డిజీయాత్ర’యాప్‌ ద్వారా త్వరలో పీఎన్‌ఆర్‌ నంబర్‌తో పాటు యూనిక్‌ ఐడీ కూడా ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని, దీంతో నిషేధిత ప్రయాణికుడిని గుర్తించవచ్చని వెల్లడించారు. 

ముఖ్య మార్గదర్శకాలు...
ప్రయాణికుడిపై విమాన పైలట్‌ ఇన్‌ కమాండ్‌ ఫిర్యాదు చేయవచ్చు. సదరు సంస్థ అంతర్గత కమిటీ దీనిపై 30 రోజుల్లోగా విచారణ జరపాలి.  
ఒకవేళ ఈ గడువు లోగా దర్యాప్తు పూర్తికాకపోతే సదరు ప్రయాణికుడు విమానాల్లో విహరించవచ్చు.  
దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికుడిని విమానయాన సంస్థతో పాటు స్థానిక పోలీసులు కూడా విచారిస్తారు. అవసరమైతే క్రిమినల్‌ కేసుతో ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేసే అవకాశం ఉంది.  
దుష్ప్రవర్తన తీవ్రతను బట్టి ఎంత కాలం నిషేధం విధించాలన్నది కమిటీ నిర్ణయిస్తుంది.  
♦  ప్రయాణికుడిపై తీసుకున్న చర్యలను విమానయాన సంస్థ కేంద్రానికి తెలపాలి  
హోంశాఖ సూచన మేరకు జాతీయ భద్రతకు విఘాతం కలిగించే ప్రయాణికుల పేర్లను కూడా ‘నో ఫ్లై’జాబితాలో చేర్చాలి.  

దుష్ప్రవర్తన తీవ్రతనుబట్టి నిషేధాన్ని మూడు రకాలుగా విభజించారు
దూషణ: మూడు నెలల నిషేధం (తిట్టడం, మాటలతో వేధించడం, మద్యం సేవించి ఇబ్బంది కలిగించడం వంటివి)  
భౌతిక దాడి: ఆరు నెలల నిషేధం (తొయ్యడం, కొట్టడం, అసభ్య ప్రవర్తన)  
బెదిరించడం: రెండేళ్ల నుంచి జీవిత కాల నిషేధం (దీన్ని తీవ్రమైన చర్యగా భావిస్తారు. చంపుతానని బెదిరించడం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటివి) 
ఒకవేళ ప్రయాణికుడు మళ్లీ అదే తప్పు చేస్తే గతంలో విధించిన నిషేధానికి రెట్టింపు కాలం నిషేధిస్తారు.  
8 నిషేధంపై ప్రయాణికుడు 60 రోజుల్లోగా మంత్రిత్వ శాఖ అప్పిలేట్‌ కమిటీని సంప్రదించవచ్చు. ఒకవేళ కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే హైకోర్టును ఆశ్రయించవచ్చు.

>
మరిన్ని వార్తలు