'వలస కూలీలు ఇకపై ఇబ్బంది పడకూడదు'

19 May, 2020 13:16 IST|Sakshi

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌  నేపథ్యంలో వలస కూలీలు పడుతున్న ఇబ్బందులపై కేంద్ర హోం శాఖ మంగళవారం మరోసారి స్పందించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన తమ స్వస్థలాలకు వెళుతున్న వలస కార్మికుల బాధలను తగ్గించడానికి అన్ని రాష్ట్రాలు సహకరించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. వలస కూలీలను తీసుకెళ్లడానికి మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. (కరోనా.. కేంద్ర మంత్రి కార్యాలయం మూసివేత)

వలస కూలీలు తమ ఇళ్లకు చేరుకోవడానికి ఏంచుకొన్న మార్గాల్లో విశ్రాంతి స్థలాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ స్థలాలను ఎన్‌జీవో సహాయంతో గుర్తించవచ్చని, వాటిని నిర్మించడంలో స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకోవాలని పేర్కొన్నారు. వలస కూలీలకు ఏర్పాటు చేయనున్న విశ్రాంతి గృహాల్లో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలని, వారికి నిత్యం ఆహారం అందుబాటులో ఉంచాలని రాష్ట్రాలకు వెల్లడించారు. ఇక రైలు పట్టాలు, రోడ్ల వెంబడి వలస కూలీలు నడవకుండా చూసేలా ఆయా రాష్ట్రాలు ప్రత్యేక చర్యలు చేపట్టేలా  అక్కడి అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చినట్లు అజయ్‌ భల్లా పేర్కొన్నారు.ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖను ట్విటర్‌లో కూడా షేర్‌ చేశారు.
(భారత్‌లో లక్ష దాటేసిన కరోనా కేసులు)

కరోనా  మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో సొంతూళ్ల బాట పట్టిన వలస కూలీలు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారు. మంగళవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 12 మంది వలస కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో వలస కూలీల బాధలు కొంతమేరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు