ఉగ్రమూకలకు ఫండ్స్‌.. కరెక్ట్‌గా స్పాట్‌ పెట్టాం!

14 Oct, 2019 16:53 IST|Sakshi

ఎన్‌ఐఏ దర్యాప్తుతో విదేశీ సంస్థలపై ఒత్తిడి

న్యూఢిల్లీ: కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్న విదేశీ సంస్థలకు కరెక్ట్‌గా చెక్‌ పెట్టామని, ఉగ్రవాదానికి నిధుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు ద్వారా ఆయా విదేశీ సంస్థలపై సరైనరీతిలో ఒత్తిడి తీసుకురాగలిగామని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ తెలిపారు. ఢిల్లీలో సోమవారం టాప్‌ పోలీసుల సదస్సులో దోవల్‌ మాట్లాడారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సమగ్రమైన వ్యూహాన్ని అవలంబించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఉగ్రవాదానికి నిధులు అందకుండా ఉక్కుపాదం మోపాల్సిన అవసరముందని, క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. 

కశ్మీర్‌ లోయలో ఉగ్రమూకలకు అందుతున్న నిధులపై ఎన్‌ఐఏ గట్టిగా చెక్‌ పెట్టడం, యాంటీ టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ గ్రూప్‌ అయిన ఫైనాన్షియల్‌ యాక‌్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు అందుతున్న నిధులపై ఎఫ్‌ఏటీఏఫ్‌ గట్టి చర్యలు తీసుకుందని, ఇది పాకిస్థాన్‌పై ఒత్తిడిని పెంచిందని పేర్కొంటూ.. సరైన ఆధారాలు, సమాచారం సేకరించడం ద్వారా ఇది సాధ్యమైందని తెలిపారు.  రాష్ట్రాల్లోని యాంటీ టెర్రరిస్ట్‌ టీమ్స్‌ను.. ఆయన ఉగ్రవాద వ్యతిరేక సైనికులుగా అభివర్ణించారు. ‘మీరు కేవలం దర్యాప్తు అధికారులు కాదు.. ఉగ్రవాద వ్యతిరేక సైనికులు. కేవలం దర్యాప్తు చేయడమే కాదు.. ఉగ్రవాదంపై సమగ్ర పోరాటాన్ని చేయాలి. కేవలం నిఘా సంస్థలే దీనిని చేయలేవు. దర్యాప్తు అధికారులు ఎఫ్‌ఐఆర్‌, చార్జ్‌షీట్‌లను మించి లక్ష్యంగా పెట్టుకోవాలి’ అని సూచించారు.

మరిన్ని వార్తలు