పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయి: అజిత్‌ దోవల్‌

26 Feb, 2020 17:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ అన్నారు. ఢిల్లీ పోలీసుల పనితీరుతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో ఇప్పటికే 20 మంది మరణించగా.. పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి సమీక్షించేందుకు అజిత్‌ దోవల్‌.. మౌజ్‌పూర్‌, జఫ్రాబాద్‌ ప్రాంతాల్లో పర్యటించారు.  స్పెషల్‌ సీపీ శ్రీవాస్తవ, అదనపు సీపీ అమన్‌దీప్‌ సింగ్‌తో కలిసి సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించారు.(ఢిల్లీ అల్లర్లు: కాల్చి పడేస్తా అన్నాడు.. దాంతో..)

ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ... వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘‘ప్రేమ భావాన్ని పెంపొందించుకోవాలి. మనందరిదీ ఒకటే దేశం. మనమంతా కలిసే జీవించాలి. అంతా కలిసే దేశాన్ని ముందకు నడిపించాలి’’అని వారికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఆయనకు ఎదురుపడిన ఓ విద్యార్థిని.. ‘‘ నేను స్టూడెంట్‌ని. ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నా. నిద్ర కూడా పట్టడం లేదు. కఠిన చర్యలు తీసుకోండి’’ అని కోరింది. ఇందుకు స్పందించిన దోవల్‌... ‘‘ నువ్వేమీ భయపడాల్సిన పనిలేదు. ప్రభుత్వం వీటికి బాధ్యత వహిస్తుంది. పోలీసులు పనిచేస్తున్నారు. మాట ఇస్తున్నా. మీకేం కాదు’’ అని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ‘‘ చట్టబద్ధమైన సంస్థల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పోలీసుల పనితీరు బాగుంది. ప్రజలు కూడా ఈ విషయంలో సంతృప్తికరంగానే ఉన్నారు’’అని పేర్కొన్నారు.

.


 

మరిన్ని వార్తలు