ఎన్‌ఎస్‌ఏగా మళ్లీ దోవల్‌

4 Jun, 2019 04:16 IST|Sakshi

కేబినెట్‌ మంత్రి హోదా

న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ – నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌)గా అజిత్‌ దోవల్‌ (74)ను కేంద్ర ప్రభుత్వం వరుసగా రెండోసారి నియమించింది. ఆయనకు కేంద్ర కేబినెట్‌ మంత్రి హోదాను కూడా తాజాగా కల్పించింది. దోవల్‌ 2014 మే 30న తొలిసారి ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం గత నెల 30న ముగిసింది. దీంతో మరోసారి ఆయననే ఎన్‌ఎస్‌ఏగా నియమించామనీ, మే 31 నుంచి మొదలై వచ్చే ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారని తెలుపుతూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు సోమవారం బయటకు వచ్చాయి.

1968 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన దోవల్‌ 2005లో ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) చీఫ్‌గా పదవీ విరమణ పొందారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టాక చేపట్టిన తొలి కీలక నియామకం ఇదే. నియామకాల కేబినెట్‌ కమిటీ దోవల్‌ నియామానికి ఆమోదం తెలిపినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఐదేళ్ల తర్వాత మోదీ పదవి నుంచి దిగిపోయినప్పుడే దోవల్‌ పదవీ కాలం కూడా ముగుస్తుందంది. వరుసగా రెండు పర్యాయాలు ఎన్‌ఎస్‌ఏగా నియమితులైన తొలి వ్యక్తి దోవలే. 2014 మే నెలలో ఆయన ఈ పదవి చేపట్టారు. అప్పటికి మంత్రి హోదా లేదు. అయితే మంత్రిస్థాయి వ్యక్తులతో తాము మాట్లాడతామని చైనా పట్టుబట్టడంతో అదే ఏడాది సెప్టెంబర్‌ నెలలో దోవల్‌కు కేంద్రం సహాయ మంత్రి హోదా కల్పించింది.

ఉరీలో ఉగ్రవాద దాడి అనంతరం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్‌ స్ట్రైక్స్‌ (లకి‡్ష్యత దాడులు) చేయడంలో దోవల్‌ కీలక పాత్ర పోషించారు. ఇటీవల పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాక్‌లోని బాలాకోట్‌పై వాయుసేన జరిపిన దాడిలోనూ ఈయన పాత్ర కీలకం. శౌర్య పురస్కారమైన కీర్తి చక్రను అందుకున్న తొలి వ్యక్తి దోవలే. 1988లో మిజో తీవ్రవాద నాయకుడు లాల్‌డెంగాను చర్చలకు ఒప్పించడంతో ఆయనకు ఈ అవార్డు దక్కింది. మిజో తీవ్రవాద సంస్థ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు మయన్మార్, చైనాల్లోకి ఆయన అప్పట్లో రహస్యంగా వెళ్లారు. దేశం లోపలే కాకుండా, సరిహద్దుల ఆవల నుంచి కూడా దేశానికి పొంచి ఉన్న ప్రమాదాల గురించి దోవల్‌ ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఉంటారు. 33 ఏళ్లపాటు ఐబీలో పనిచేశారు.

మరిన్ని వార్తలు