సుప్రీం తీర్పుతో నిర్ణయం మార్చుకున్నా : అజిత్‌ పవార్‌

27 Nov, 2019 12:56 IST|Sakshi

ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తన నిర్ణయం మార్చుకుని పార్టీ నేతలతో మాట్లాడానని డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ఎప్పటికీ ఎన్సీపీతోనే ఉంటానని, పార్టీ నుంచి తనను ఎవరైనా బహిష్కరించారా అని ఆయన ప్రశ్నించారు. తానిప్పటికీ ఎన్సీపీతోనే ఉన్నానని చెప్పారు. ప్రభుత్వంలో తన పాత్ర గురించి పార్టీ నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు.

మరోవైపు అజిత్‌ పవార్‌ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ పేర్కొనడం గమనార్హం. అజిత్‌ పవార్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో భేటీ అయ్యారని, తాను పొరపాటు చేశానని, మన్నించాలని కోరారని చెప్పారు. ప్రభుత్వంలో అజిత్‌  పవార్‌ పాత్రపై త్వరలోనే పార్టీ ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీలో తక్షణమే బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు మంగళవారం దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. బలపరీక్షకు ముందే ఫడ్నవీస్‌ సీఎం పదవికి రాజీనామా చేయడంతో మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌కు మార్గం సుగమమైంది.

మరిన్ని వార్తలు