ఆకాంక్ష గ్రామానికే ఆదర్శం

14 Jun, 2016 21:59 IST|Sakshi
ఆకాంక్ష గ్రామానికే ఆదర్శం

హర్యానా: హర్యానా రాష్ట్రం, గుర్‌గావ్ జిల్లా, బాజ్‌ఘెరా గ్రామానికి చెందిన ఆకాంక్ష ఇప్పుడు గ్రామానికే ఆదర్శంగా నిలిచింది. ఏడో తరగతి చదువుతున్న ఈ బాలిక గ్రామంలో కనీస సౌకర్యాలు లేక పోవడం వల్ల ఎప్పుడూ చికాకు పడేది. రోజు వెళ్లే స్కూల్‌కు కూడా సరైన రోడ్డు లేక మురుగునీరు పారుతుంటే బాధ పడేది. ఓ రోజు ‘వియ్ ది పీపుల్’ అనే సంస్థ గ్రామంలో నిర్వహించిన ఓ పౌర కార్యక్రమానికి హాజరైంది. పౌరుల హక్కులే మిటో, బాధ్యతలు ఏమిటో, వారికి రాజ్యాంగం కల్పిస్తున్న భద్రత ఏమిటో ఆ కార్యక్రమంలో అవగాహన చేసుకొంది.
 
ఊరి సమస్యలపై ఉద్యమించాలని నిర్ణయించుకుంది. అందుకు తోటి విద్యార్థులను తోడు చేసుకుంది. ఊరికి రోడ్లు వేయడం ఎవరి బాధ్యతో టీచర్లను అడిగి తెలుసుకొంది. తోటి విద్యార్థులతో కలసి పంచాయతీ కార్యాలయానికి వెళ్లి సరైన రోడ్లు వేయాల్సిందిగా కోరింది. ఆ సర్పంచ్ పట్టించుకోలేదు. ఆమె మాట వినలేదు. గుర్‌గావ్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లింది. గ్రామ రోడ్ల దుస్థితి గురించి వివరించింది. రోడ్లు వేయడం పంచాయతీ బాధ్యతంటూ రోడ్లు వేయాల్సిందిగా పంచాయతీని కోరుతూ ఓ సిఫారసు లేఖను తీసుకొచ్చింది. మళ్లీ సర్పంచ్‌ను కలిసింది. అయినా సర్పంచ్ పట్టించుకోలేదు.

అయినా నిరుత్సాహ పడకుండా తోటి విద్యార్థులతో కలసి జిల్లా కలెక్టర్‌ను కలసుకుంది. విద్యార్థుల వివరించిన సమస్యలకు స్పందించిన జిల్లా కలెక్టర్ గ్రామానికి 20 లక్షల రూపాయలను మంజూరు చేయడమే కాకుండా రోడ్ల పనులను వెంటనే చేపట్టాల్సిందిగా గ్రామ పంచాయతీని ఆదేశిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను తీసుకొని వచ్చి మళ్లీ సర్పంచ్‌ను ఆకాంక్ష కలిసింది. కలెక్టర్ ఆదేశాలవడంతో సర్పంచ్ ఈసారి స్పందించారు. ఆగమేఘాల మీద రెండు నెలల్లో స్కూల్‌కు మంచి సిమ్మెంట్ రోడ్డు వేయించారు. ఆ తర్వాత గ్రామంలోని అన్ని రోడ్లను వేయించారు. ఊరు కళనే మారిపోయింది.
 
ఎక్కడ మురుగు నీరు నిల్వకుండా కాల్వను కూడా తవ్వించడంతో గ్రామానికి కనీస సౌకర్యాలు సమకూరాయి. ఆకాక్ష కృషిని మెచ్చుకున్న గ్రామస్థులు ఆమెను ఆదర్శంగా తీసుకొని గ్రామానికి ఏ సమస్య వచ్చినా కలిసి పోరాడి సాధించుకుంటున్నారు. ‘మన హక్కులేమిటో తెలుసుకున్నాక నాకో విషయం అర్థమైంది. పనులు చేయడం లేదని ప్రభుత్వాన్ని నిందించడంకన్నా మన పనులను ప్రభుత్వంతో చేయించుకోవాలని. ముందుగా మన బాధ్యతలను నిర్వహిస్తే ప్రభుత్వం తన బాధ్యతను గుర్తిస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా మనం గళం విప్పితేనే ప్రభుత్వం కదులక తప్పదు’ అన్న సందేశం ఆకాంక్ష ఇస్తోంది. ఆకాంక్ష పోరాటంతో గ్రామ సర్పంచ్ వైఖరి కూడా మారింది.

మరిన్ని వార్తలు