అది కేవలం స్టాలిన్‌ అభిప్రాయం : అఖిలేష్‌

19 Dec, 2018 09:08 IST|Sakshi
ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ (ఫైల్‌ఫోటో)

లక్నో : తదుపరి దేశ ప్రధానిగా రాహుల్‌ గాంధీని ప్రతిపాదిస్తూ డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు విపక్ష కూటమి అభిప్రాయంగా పరిగణించాల్సిన అవసరం లేదని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. బీజేపీ పట్ల దేశ ప్రజలు అసంతృప్తితో ఉన్నందునే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అనూహ్య విజయాలు సాధించిందని చెప్పారు.

2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాలను ఏకం చేసేందుకు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ తదితరులు ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలో పీఎం అభ్యర్థిపై ఒకరు (స్టాలిన్‌) తన అభిప్రాయం వెల్లడిస్తే అది అలయన్స్‌ అభిప్రాయంగా చూడరాదని ఆయన పేర్కొన్నారు. 

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ప్రధాని అభ్యర్ధిగా రాహుల్‌ గాంధీని స్టాలిన్‌ ప్రతిపాదించడం పట్ల బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో అఖిలేష్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతిరించుకున్నాయి. మరోవైపు స్టాలిన్‌ ప్రతిపాదనను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సైతం తోసిపుచ్చారు. లోక్‌సభ ఎన్నికల అనంతరమే విపక్ష కూటమి తమ ప్రదాని అభ్యర్థిని ప్రకటిస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు