వికాస్‌ దూబే హతం: అఖిలేశ్‌ స్పందన

10 Jul, 2020 12:00 IST|Sakshi

వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌: ఒమర్‌ అబ్దుల్లా, ప్రియాంకా గాంధీ ట్వీట్లు

లక్నో: కరుడుగట్టిన నేరస్తుడు, గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌పై ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ స్పందించారు. నిజానికి కారు బోల్తా పడలేదని, రహస్యాలు బయటపడి ప్రభుత్వం బోల్తా పడకుండా రక్షించారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా యూపీలో అనేక నేర కార్యకలాపాలకు పాల్పడిన వికాస్‌ దూబే వారం రోజుల క్రితం తన అనుచరులతో కలిసి ఎనిమిది మంది పోలీసుల ప్రాణాలు బలితీసుకున్న విషయం తెలిసిందే. (గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే హతం)

ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం అతడిని మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. సమాచారం అందుకున్న యూపీ పోలీసులు అక్కడికి చేరుకుని.. రోడ్డు మార్గం గుండా శుక్రవారం ప్రత్యేక ఎస్కార్ట్‌లో వికాస్‌ను కాన్పూర్‌కు తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పోలీసుల తుపాకీ లాక్కునేందుకు అతడు ప్రయత్నించిన క్రమంలో వాహనం బోల్తా పడిందని, అనంతరం తమపై కాల్పులు జరపగా ఎన్‌కౌంటర్‌ చేశామని పోలీసులు తెలిపారు.(వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్: అనేక అనుమానాలు!)

ఈ క్రమంలో వికాస్‌ అరెస్టైన తీరుపై అనుమానం వ్యక్తం చేసిన అఖిలేఖ్‌ యాదవ్‌.. గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు పట్టుకున్నారా లేదా అతడే లొంగిపోయాడో చెప్పాలంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను డిమాండ్‌ చేశారు. ఇక తాజాగా ఎన్‌కౌంటర్‌లో అతడు హతం కావడంతో.. ‘‘నిజానికి కారు బోల్తా పడలేదు. రహస్యాలు బహిర్గతం కాకుండా.. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం బోల్తా పడకుండా రక్షించడం జరిగింది’’అంటూ తనదైన శైలిలో ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.

కాగా అఖిలేశ్‌తో పాటు జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా ఈ ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. ‘‘చనిపోయిన వ్యక్తి ఎలాంటి కథలు చెప్పలేడు’’ కదా ఒమర్‌ ట్వీట్‌ చేయగా.. ‘‘నేరస్తుడు చచ్చిపోయాడు. మరి అతడు చేసిన నేరాలు, అందుకు సహకరించిన వారి సంగతేంటి’’ అని ఆమె ప్రశ్నించారు. కాగా ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వికాస్‌ దూబేను విచారిస్తే పోలీసులు, రాజకీయ నాయకులతో అతడికి ఉన్న సంబంధాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే ఎన్‌కౌంటర్‌ చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

>
మరిన్ని వార్తలు