అక్కడ కాంగ్రెస్‌ను అందుకే పక్కనపెట్టాం..

22 Jan, 2019 13:38 IST|Sakshi

లక్నో : యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి నుంచి కాంగ్రెస్‌ను పక్కనపెట్టడంపై ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ వివరణ ఇచ్చారు. యూపీలో బీజేపీని ఓడించే ఉద్దేశంతోనే దీటైన ఎన్నికల ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్‌ను దూరం చేశామని అఖిలేష్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో తమకు స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.

యూపీలో బీజేపీకి ప్రాబల్యం లేదని, కులాల సమతూకంపై బీజేపీ ముందుకుపోతుందని..తామూ ఎన్నికల లెక్కలను సరిదిద్దుకుని, ఎస్పీ-బీఎస్పీ పొత్తుతో ముందుకువచ్చామని చెప్పారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకెళ్లామని, ఎన్నికల పొత్తులు సవ్యవగా లేకపోవడంతో తాము పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఓటమి పాలయ్యామని చెప్పుకొచ్చారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ ప్రత్యర్ధి బీఎస్పీతో చేతులు కలిపి ఎన్నికలకు వెళ్లడం వ్యూహాత్మక నిర్ణయమన్నారు. బీజేపీని ఓడించేందుకే తాము జట్టుకట్టామని, అయితే కాంగ్రెస్‌కు రెండు స్ధానాలు విడిచిపెట్టామని, ఆ పార్టీతో తమ సంబంధాలు మెరుగ్గానే ఉంటాయని అఖిలేష్‌ పేర్కొన్నారు. బీజేపీ ఓటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు