మాజీ ముఖ్యమంత్రిని ఉతికి ఆరేశారు!

10 May, 2017 18:12 IST|Sakshi
మాజీ ముఖ్యమంత్రిని ఉతికి ఆరేశారు!

సైనికుల మరణాల విషయంలో కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నించిన యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను సోషల్ మీడియాలోను, మామూలుగా కూడా చాలామంది ఉతికి ఆరేశారు. జమ్ము కశ్మీర్‌లో ఒక యువ సైనికాధికారిని షోపియాన్ జిల్లాలో కిడ్నాప్ చేసి హతమార్చిన ఘటనపై ఆయన చేసిన వ్యాఖ్యలు పలు వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. ''ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఘటనలకు సమాధానం లేదు. కొంతమంది తలలు నరికేస్తున్నారు, శరీరాలు ఛిద్రం చేస్తున్నారు... అయినా దానిపై చర్చ ఎందుకు లేదు? యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో చాలామంది అమర సైనికులు ఉన్నారు. కానీ గుజరాత్‌కు చెందిన ఒక్క సైనికుడూ ఎందుకు మరణించడం లేదు?'' అని అఖిలేష్ ప్రశ్నించారు. సైనికుల మరణాలతో రాజకీయాలు చేయకూడదని.. కానీ వందేమాతరం మీద కూడా రాజకీయాలు ఉన్నాయని ఆయన అన్నారు.

అయితే ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు.. అది కూడా సైనికుల మరణం విషయంలో ఎలా చేస్తారని పలువురు ప్రశ్నించారు. అఖిలేష్ ప్రకటన చాలా బాధాకరమని, దాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని యూపీ మంత్రి శ్రీకాంత్ శర్మ అన్నారు. ఆయన ఓటమిని అంగీకరించలేక తన కోపాన్ని ఇలాంటి ప్రకటనల రూపంలో బయటకు కక్కుతున్నారని విమర్శించారు. ఇక సోషల్ మీడియాలో కూడా పలువురు అఖిలేష్ వ్యాఖ్యల మీద తీవ్రంగా మండిపడ్డారు. అఖిలేష్ ఇన్సల్ట్స్ మార్టిర్స్ అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ టాపిక్‌లలోకి ఎక్కింది. గుజరాతీలు చాలామంది తమ జీవితాలను త్యాగం చేశారని, కానీ అఖిలేష్ కుటుంబం నుంచి మాత్రం ఎవరూ ఇలాంటి త్యాగాలు చేయలేదన్న విషయం కచ్చితంగా చెప్పగలమని కెప్టెన్ శక్తి రాథోడ్ ట్వీట్ చేశారు. ఇలాగే ఇంకా కొన్ని వేల ట్వీట్లు ఇదే అంశం మీద వచ్చాయి.

 

మరిన్ని వార్తలు