సిట్‌ అధికారుల ఎదుట హాజరైన అక్షయ్‌

21 Nov, 2018 11:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2015లో సిక్కు మద్దతుదారుల ఆందోళనల్లో 60 మంది మరణించిన కేసుకు సంబంధించి బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌  ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఎదుట బుధవారం హాజరయ్యారు. కోట్కపురా సహా పలు ప్రాంతాల్లో చెలరేగిన ఈ ఘర్షణల్లో అక్షయ్‌తో పాటు అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా గుర్మీత్‌ సింగ్‌, బాదల్‌లకు సంబంధం ఉందని ఆరోపణలున్నాయి. కాగా  డేరా చీఫ్‌ గుర్మీత్‌ రాం రహీం సింగ్‌, మాజీ సీఎం సుక్బీర్‌ సింగ్‌ బాదల్‌ల మధ్య రూ వంద కోట్ల ఒప్పందానికి సంబంధించి మధ్యవర్తిత్వం వహించారనే ఆరోపణలపైనా అక్షయ్‌కుమార్‌ను సిట్‌ ప్రశ్నించనుంది. మరోవైపు బాలీవుడ్‌ నటుడిని  ప్రశ్నించేందుకు సిట్‌ సమన్లు జారీ చేయగా, ఈ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తానెన్నడూ గుర్మీత్‌ సింగ్‌ను కలవలేదని స్పష్టం చేశారు.

చండీగఢ్‌లో సిట్‌ అధికారుల ఎదుట హాజరవుతానని అక్షయ్‌ ట్వీట్‌ చేశారు. గుర్మీత్‌ నటించిన మెసెంజర్‌ ఆఫ్‌ గాడ్‌ (ఎంఎస్‌జీ) సినిమాను పంజాబ్‌లో విడుదలయ్యేలా సహకరించేందుకు గుర్మీత్‌ సింగ్‌, బాదల్‌ల మధ్య అక్షయ్‌ కుమార్‌ మధ్యవర్తిత్వం నెరిపారని ఆరోపణలు వచ్చాయి. అక్షయ్‌ నివాసంలోనే వీరిద్దరి భేటీ జరిగిందని చెబుతున్నారు. అయితే గుర్మీత్‌ను తానెప్పుడూ కలవనేలేదని బాదల్‌ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.

కాగా, 2015లో ముంబైలోని అక్షయ్‌ ప్లాట్‌లో డేరా చీఫ్‌, సుక్బీర​ బాదల్‌లు సమావేశమయ్యారని పంజాబ్‌లో ఎంఎస్‌జీ మూవీ విడుదల కోసం ఈ సమావేశం జరిగిందని మాజీ ఎంపీ హరభన్స్‌ జలాల్‌ లేఖలో ఆరోపించారని రంజిత్‌ సింగ్‌ కమిషన్‌ నివేదిక పేర్కొంది.

మరిన్ని వార్తలు