రైల్వే వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన అల్ కాయిదా!

2 Mar, 2016 16:39 IST|Sakshi
రైల్వే వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన అల్ కాయిదా!

భారత రైల్వేలకు చెందిన ఓ వెబ్‌సైట్‌ను అల్ కాయిదా ఉగ్రవాదులు హ్యాక్ చేయడం సంచలనం రేపింది. సెంట్రల్ జోన్ పరిధిలోని మహారాష్ట్రలోని భుసావల్ డివిజన్‌కు చెందిన వెబ్‌సైట్‌ను ఆల్ కాయిదా టెర్రరిస్టులు హ్యాక్ చేశారు. ఆ సైట్‌లో 11 పేజీలున్న ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. దీంతో నిఘా అధికారులు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదుల నుంచి భారతీయ రైల్వేకు తొలిసారి ఇలాంటి  పరిణామం ఎదురు కావడం ఆందోళన రేపింది. రైల్వేశాఖ వెబ్‌సైట్ హ్యాకింగ్‌ ద్వారా  విద్రోహ చర్యలకు పాల్పడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా అన్న కోణంలో నిఘావర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి.
 
ఉగ్రవాద నేత అసీమ్ ఉమర్ సందేశాన్ని అందులో పోస్ట్ చేశారు. భారత ముస్లింలు జిహాద్ పాఠాలు మర్చిపోతున్నారని... వారికి మళ్లీ పాఠాలు నేర్పి యుద్ధరంగానికి కదిలేలా చేస్తామని  ఆ సందేశంలో హెచ్చరించారు. ప్రజలు 'జిహాద్' లో పాల్గొనేందుకు, అమెరికా దాని మిత్రపక్షాలను ఓడించడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

సెంట్రల్ రైల్వేలో 115 రైల్వే స్టేషన్లు ఉన్న భుసావల్ డివిజన్ వెబ్‌సైట్‌కు ట్రాఫిక్ రద్దీ ఎక్కువే.  ఈ డివిజన్ పరిధిలో సుమారు 15 శాతం ముస్లిం జనాభా ఉంది. ఈ నేపథ్యంలోనే తమ భావజాల విస్తరణకు అల్ కాయిదా ఈ చర్యకు పూనుకుందని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అసీమ్ ఉమర్ (సనౌల్ హక్) అల్ కాయిదా దక్షిణాసియా విభాగానికి చీఫ్. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత అల్ కాయిదాలో చేరిన ఉమర్ 1995 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

మరిన్ని వార్తలు