దక్షిణాది రాష్ట్రాల మద్యం వాటా 45% 

9 May, 2020 06:39 IST|Sakshi

ముంబై : ఐదు దక్షిణాది రాష్ట్రాల్లోనే దాదాపు 50% మద్యం వినియోగిస్తున్నారనీ, పన్నుల ద్వారా ఈ రాష్ట్రాలకు 10 నుంచి 15% వరకు ఆదాయం వస్తున్నట్టు క్రిజిల్‌ రిపోర్టు వెల్లడించింది. యావత్‌ దేశం మద్యం వినియోగంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ వాటా 45 శాతంగా ఉన్నట్టు ఆ రిపోర్టు వెల్లడించింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు 15 శాతం ఆదాయంతో అగ్రభాగాన ఉన్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ లు చెరి 11%, తెలంగాణ 10% ఆదాయం పొందుతున్నాయని ఆ రిపోర్టు వెల్లడించింది. మద్యం ద్వారా వస్తోన్న ఆదాయంలో 12 శాతంతో ఢిల్లీ దేశంలో మూడోస్థానంలో ఉంది. వినియోగంలో మాత్రం జాతీయ స్థాయిలో 4 శాతంగా ఉంది. దేశంలో 13% వినియోగం ఒక్క తమిళనాడులోనే ఉండగా, 12%తో కర్ణాటక, తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌ (7%), తెలంగాణ (6%), కేరళ (5%)ఉన్నాయి. 3.3 కోట్ల జనాభా ఉన్న కేరళ మద్యం విక్రయాలపై ఎక్కువ పన్నులతో అత్యధిక ఆదాయాన్ని పొందుతోంది. దేశవ్యాప్తంగా ఐదు దక్షిణాది రాష్ట్రాలతో కలిపి, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ సహా 12 రాష్ట్రాలు 75% మద్యాన్ని వినియోగిస్తున్నాయి. ఈ 12 రాష్ట్రాల్లోనే కోవిడ్‌ కేసులూ, మరణాలూ 85 శాతానికి పైగా ఉండడం గమనార్హం.   

మరిన్ని వార్తలు