ఫేస్ మాస్కుల‌తో సైడ్ ఎఫెక్ట్స్‌..

26 May, 2020 20:12 IST|Sakshi

ఫేస్ మాస్క్.. ఇప్పుడు జీవ‌న విధానంలో ఒక భాగ‌మైపోయింది. ఇది లేక‌పోతే ప్ర‌మాదం అని అంద‌రూ చెప్తున్న మాట‌. హాంకాంగ్‌లోని ప‌రిశోధ‌కుల అధ్య‌య‌నం ప్ర‌కారం మాస్కులు క‌రోనా వంటి వైర‌స్‌ల వ్యాప్తిని నిరోధించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. సుమారు 3వేల‌మందిపై అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఫేస్ మాస్క్ ధ‌రించ‌నివారిలో వైర‌స్ వ్యాప్తికి ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపారు. అయితే ఈ ఫేస్ మాస్క్ వ‌ల్ల దుష్ప్ర‌భావాలు లేవా? అంటే ఉన్నాయ‌నే చెప్పొచ్చు. పైగా పిల్ల‌ల‌కు ఇవి ఎంతో హానిక‌ర‌మ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

శ‌రీరంలో త‌గ్గిన ఆక్సిజ‌న్ స్థాయి
కొన్ని సంద‌ర్భాల్లో‌ గంట‌ల త‌ర‌బ‌డి మాస్క్ ధ‌రించ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయి త‌గ్గిన‌ట్లు తేలింది. సింథ‌టిక్ ప‌దార్థంతో త‌యారు చేసిన మాస్క్‌ల‌ను వినియోగించిన వారిలో ముఖంపై ద‌ద్దుర్లు వ‌స్తున్నాయి. దీంతో ఎన్ 95, ఎన్ 99, కాట‌న్ మాస్క్ లేదా సొంతంగా మాస్క్‌లు త‌యారు చేసి వినియోగించుకోండ‌ని నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు. అయితే 2 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న పిల్ల‌ల‌కు మాస్కులు ధ‌రించ‌డం ప్ర‌మాద‌క‌రం అని జ‌పాన్ పీడియాట్రిక్ అసోసియేష‌న్ సోమ‌వారం హెచ్చ‌రించింది. (ఫేస్‌మాస్క్‌ల గురించి మనకు ఏం తెలుసు?)

అదే ప‌నిగా మాస్క్‌.. న్యూమోనియాకు అవ‌కాశం!
'ఫేస్ మాస్క్ ధ‌రించ‌డం వ‌ల్ల వారికి ఊపిరి పీల్చుకోవ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది, గుండెపై అధిక భారం ప‌డుతుంది' అని అధ్య‌య‌నంలో తెలిపింది. మాస్కులు వాడ‌టం వ‌ల్ల పిల్ల‌ల్లో శ్వాస‌కోస స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌ని, న్యూమోనియాకు దారి తీసే ప్ర‌మాదముందని హెచ్చ‌రించింది. పిల్ల‌ల శ‌రీరం నుంచి  వెలువ‌డే వేడిని సైతం బ‌య‌ట‌కు వెళ్ల‌నివ్వ‌కుండా మాస్కులు అడ్డుపడ‌తాయ‌ని పేర్కొంది. రెండేళ్ల కంటే ఎక్కువ వ‌యసున్న వారు మాత్ర‌మే ఫేస్ మాస్కుల‌ను వినియోగించాల‌ని అమెరిక‌న్ సీడీసీ (సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్‌) నొక్కి చెప్తోంది. (మాస్క్‌లతో రన్నింగ్‌ చేయవచ్చా?!)

మరిన్ని వార్తలు