తమిళనాడులో ‘లష్కరే’ జాడ

24 Aug, 2019 03:57 IST|Sakshi
శుక్రవారం కోయంబత్తూరులో మోహరించిన భద్రతాబలగాలు

కోయంబత్తూరులో ఆరుగురు తిష్ట?

హై అలర్ట్‌..నిఘా వలయంలో రాష్ట్రం

సాక్షి, చెన్నై: తమిళనాడులోకి సముద్రమార్గం గుండా లష్కరే తోయిబా ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం రావటంతో పోలీసులు శుక్రవారం గట్టి భద్రత చర్యలు చేపట్టారు. ఒక పాకిస్తానీతో పాటు శ్రీలంకకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు కోయంబత్తూరులో తిష్ట వేసినట్టు తెలియడంతో వారి కోసం పోలీసులు జల్లెడపడుతున్నారు.  తీవ్రవాదుల హిట్‌లిస్ట్‌లో చెన్నై, మధురై, కోయంబత్తూరు ఉన్నట్టుగా కేంద్ర నిఘావర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీచేశాయి.

ఇటీవల ఈస్టర్‌ పర్వదినాన శ్రీలంకలో సాగిన వరుసబాంబు పేలుళ్ల అనంతరం ఎన్‌ఐఏ తమిళనాడుపై దృష్టి పెట్టింది. ఐసిస్‌ మద్దతుదారులకు విదేశాల్లో శిక్షణనిచ్చి ఇక్కడ చొప్పించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల్ని ఎన్‌ఐఏ వర్గాలు అరెస్టు చేసి విచారణ కూడా జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో పోలీసులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. డీజీపీ త్రిపాఠి, అదనపు డీజీపీ జయంతి మురళి పర్యవేక్షణలో ఐజీలు, డీఐజీలు, ఎస్పీల స్థాయి నుంచి కింది స్థాయి పోలీసు వరకు రంగంలోకి దిగారు.

నుదుట తిలకం పెట్టుకుని...
కోయంబత్తూరులో చొరబడ్డ ఆరుగురు ఉగ్రవాదులు నుదుట తిలకం పెట్టుకుని ఉన్నారని, బాంబు పేలుళ్లే లక్ష్యంగా హిందూ సంఘాలు, బీజేపీ నేతల్ని సైతం గురిపెట్టారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సాయుధ బలగాలనూ రంగంలోకి దింపారు. చెన్నైలో ఐదువేల మంది పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు సాగుతున్నాయి. శ్రీలంకకు అతి సమీపంలో ఉన్న రామేశ్వరం, పాంబన్, వేదారణ్యం, ముత్తుపేట, నాగపట్నం తీర ప్రాంతాల్ని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. 

మరిన్ని వార్తలు