నా తప్పేమి లేదు: సౌరభ్‌

22 Oct, 2018 19:21 IST|Sakshi
రైలు ప్రమాద ఘటనా స్థలం, ఇన్‌సెట్‌లో సౌరభ్‌ మదన్‌

అమృత్‌సర్‌: పండుగ వేళ అందరినీ ఒకచోట చేర్చి వేడుక నిర్వహించాలన్న ఉద్దేశంతోనే దసరా ఉత్సవం ఏర్పాటు చేశానని పంజాబ్‌ కాంగ్రెస్‌ యువజన నాయకుడు సౌరభ్‌ మిథు మదన్‌ తెలిపారు. వేడుకలు పెనువిషాదంగా మారతాయని ఊహించలేదని వాపోయారు. అమృత్‌సర్‌ నగర శివార్లలోని జోడా ఫాటక్‌ సమీపంలో శుక్రవారం దసరా వేడుకల సందర్భంగా జరిగిన రైలు ప్రమాదంలో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్యక్రమ నిర్వాహకుడైన సౌరభ్‌ ఈ ఘటన తర్వాత అదృశ్యమయ్యారు. సోమవారం ఒక వీడియో విడుదల చేశారు. వేడుకల నిర్వాహణకు అన్ని అనుమతులు తీసుకున్నామని, తన తప్పేంలేదని చెప్పారు. తనపై కొంతమంది కావాలనే బురద చల్లుతున్నారని వాపోయారు. రైలు ప్రమాద ఘటన తనను ఎంతగానో  కలచివేసిందని ఆవేదన చెందారు. (పెను ప్రమాదం.. అంతులేని శోకం)

‘సెక్యురిటీ కోసం 50 నుంచి 100 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. ముందస్తు జాగ్రత్త కోసం మున్సిపల్‌ అధికారులు అగ్నిమాపక వాహనం కూడా పంపించారు. రైలు పట్టాలపై నుంచోవద్దని ప్రజలకు కనీసం పదిసార్లు విజ్ఞప్తి చేశాన’నని వెల్లడించారు. రైలు ప్రమాదం జరిగిన తర్వాత తన తండ్రి, కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ విజయ్‌ మదన్‌, కుటుంబ సభ్యులతో కలిసి సౌరవ్‌ ఉడాయించారు. శుక్రవారం రాత్రి 6.59 గంటల సమయంలో అమృత్‌సర్‌లోని పింగ్‌ల్‌వాడా ప్రాంతంలో ఉన్న తమ నివాసం నుంచి వీరంతా వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైయ్యాయి. ఈ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా విజయ్‌, సౌరభ్‌లను ఎక్కువ మంది తప్పుబడుతున్నారు. అయితే ఈ దుర్ఘటనకు మీరు కారణమంటే మీరు కారణమని రైల్వే, రాజకీయ నేతలు, స్థానిక అధికార యంత్రాంగం పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. (పచ్చి అబద్ధం.. అలా జరగలేదు!)

ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు
రైలు ప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. పంజాబ్‌ ప్రభుత్వానికి, రైల్వే బోర్డు, రైల్వే మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

మృతుల కుటుంబాలకు పరిహారం
దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ పరిహారం పంపిణీ చేశారు. రూ. 5 లక్షల రూపాయల చెక్కులను బాధితులకు అందజేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పంజాబ్‌ ప్రభుత్వం పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే ప్రమాదంలో మృతి చెందిన నలుగురు బిహారీల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ పరిహారం ప్రకటించారు.

మరిన్ని వార్తలు