జిన్నా ఏకైక కూతురు కన్నుమూత

3 Nov, 2017 09:57 IST|Sakshi

సాక్షి, ముంబై : జాతీయ మీడియాలో ఇప్పుడు దినా వాదియా మరణం గురించి వార్తలు ప్రముఖంగా ప్రచురితం అవుతున్నాయి. న్యూయార్క్‌లో మరణించిన ఈ 98 ఏళ్ల ఈ వృద్ధురాలి గురించి ఓ ప్రత్యేకత ఉంది. పాకిస్థాన్‌ జాతి పిత, ముస్లిం లీగ్ నేత మహ్మద్‌ అలీ జిన్నా ఏకైక కూతురే ఆమె. గురువారం ఆమె అనారోగ్యంతో కన్నుమూశారు.

జిన్నా-రత్నన్‌భాయ్‌ పేటిట్‌ దంపతులకు 1919 ఆగష్టు 15న దినా జన్మించింది. నిజానికి జిన్నా పూర్వీకులు గుజరాత్‌కు చెందిన వారే. అయినప్పటికీ 1870 లో ఆయన కుటుంబం వ్యాపారం కోసం కరాచీకి వెళ్లి స్థిరపడిపోయారు. అక్కడే జిన్నా జన్మించారు. జిన్నా భార్య రత్నన్‌ మాత్రం ముంబై పెటిట్‌-టాటా కుటుంబానికి చెందిన వారు. ఇక భారత్-పాక్‌ విభజన తర్వాత జిన్నా కుటుంబం పాకిస్థాన్‌కు తరలి వెళ్లిపోగా, ఆయన కూతురు దినా మాత్రం ప్రముఖ వ్యాపారవేత్త నివిల్లే వాదియా వ్యాపారవేత్తను వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడిపోయింది. 

ధైర్యవంతమైన మహిళగా గుర్తింపు... 

దినా ముక్కు సూటి స్వభావం గల వ్యక్తి. చాలా ధైర్యస్తురాలని కీర్తించేవారు. తాను భారత గడ్డపై పుట్టిన బిడ్డనంటూ ఆమె పలుమార్లు ప్రకటించుకున్నారు. విభజన తర్వాత పాక్‌కు వెళ్లేందుకు అయిష్టత వ్యక్తం చేసిన ఆమె.. ఆ తర్వాత ఆమె తన కుటుంబంతో అంతగా సంబంధాలు కొనసాగించలేదు. 1948లో తండ్రి(జిన్నా) అంత్యక్రియలకు మాత్రమే ఆమె వెళ్లి వచ్చింది. అయితే 2004లో ఇండియా-పాకిస్థాన్‌ మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగిన సిరీస్‌ కోసం అప్పటి అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ ఆహ్వానం మేరకు వెళ్లారు. క్రికెట్ ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయన్న నమ్మకం ఆమె వ్యక్తం చేశారు. అయితే 2007లో ముంబైలోని తన తండ్రి ఇంటిని తనకు అప్పగించాలంటూ ఓ పిటిషన్ ఆమె దాఖలు చేశారు. అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. కొన్నాళ్లుగా ఆమె న్యూయార్క్‌లోని తనయుడు నుసిల్‌ వాదియా(వాదియా గ్రూప్‌ చైర్మన్‌) ఇంట్లో ఉంటుండగా.. మరణ వార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

మరిన్ని వార్తలు