మందుల కోసం కశ్మీర్‌ నుంచి ఢిల్లీకి

10 Aug, 2019 16:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌కు చెందిన 26 ఏళ్ల ప్రముఖ జానపద గాయకుడు అలీ సఫుద్దీన్‌ ఆస్తమాతో బాధ పడుతున్న తన 78 ఏళ్ల తల్లికి మందులు కొనుక్కు పోవడానికి శ్రీనగర్‌ నుంచి గురువారం నాడు ఢిల్లీకి విమానంలో బయల్దేరి వచ్చారు. ‘ఆగస్టు 4వ తేదీ నుంచి కశ్మీర్‌ అంతటా అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. మందుల షాపులతో సహా అన్ని దుకాణాలు, మార్కెట్లు మూతపడ్డాయి. మొబైల్, ల్యాండ్‌ లైన్లు మూగబోయాయి. ఇంటర్నెట్‌ సౌకర్యం, కేబుల్‌ ప్రసారాలు నిలిచిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు నిరవధికంగా మూసివేత. వీధుల్లో భారీగా సైనిక దళాల మొహరింపు. ఎక్కడికక్కడే బారికేడ్లు. అక్కడక్కడ ఆడుకునే ఒకలిద్దరు పిల్లలు తప్పా అంతా నిర్మానుష్యం’ అని సఫుద్దీన్‌ కశ్మీర్‌ పరిస్థితి గురించి మీడియాకు వివరించారు.

సభలూ, సమావేశాలు నిషేధిస్తూ ప్రభుత్వం 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించగా, అక్కడ పరిస్థితేమో కర్ఫ్యూను తలిపిస్తోంది. ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ చదివిన సఫుద్దీన్‌ కశ్మీర్‌ యూనివర్శిటీ నుంచి ‘మాస్‌ కమ్యూనికేషన్స్‌’లో పీజీ చేశారు. ఆ తర్వాత సొంతంగా ఓ చిన్న రికార్డింగ్‌ స్టూడియోను ప్రారంభించి సొంతంగా కశ్మీర్‌ పాటల్‌ ఆల్బమ్‌ను విడుదల చేశారు. 16వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కశ్మీర్‌ కవి హబ్బా ఖతూన్‌ రాసిన ఓ కవితను ఆయన గానం చేశారు. దాన్ని ఇటీవల విడుదలైన ‘నో ఫాదర్స్‌ ఇన్‌ కశ్మీర్‌’ అనే సినిమాలో ఉపయోగించారు. ప్రస్తుం కశ్మీర్‌ ప్రజల మనోభావాల గురించి ప్రశ్నించగా 1990 దశకంలో అక్కడ స్వతంత్య్ర బీజం పడిందని, అది మొక్కై పెరిగి, ఇప్పుడు వృక్షమైందని చెప్పారు. ఢిల్లీకి రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల విమానం టిక్కెట్‌ నాలుగువేలయిందని చెప్పారు. మూడు వందల రూపాయల మెడిసిన్‌ కోసం పది వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సఫుద్దీన్‌ లాంటి వారు ఢిల్లీకి రాగలిగారుగానీ, ఆస్పత్రులకు వెళ్లేందుకు ఎలాంటి వాహనాలు లేక, వెళితే మందులు లేక స్థానిక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ వేళల్లో శ్రీనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి 800 నుంచి 900 మంది రోగులు వచ్చేవారని, గత ఐదు రోజులుగా రెండు వందలకు మించి రావడం లేదని అక్కడి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు