‘అందుకే కారులో హెల్మెట్‌ పెట్టుకుంటున్నా’

9 Sep, 2019 19:31 IST|Sakshi

లక్నో : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటార్‌ వాహన సవరణ చట్టం-2019 వల్ల ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారు భారీ జరిమానాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సాంకేతిక తప్పిదాల కారణంగా నిబంధనలు పాటించిన వారికి సైతం ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించి విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా హెల్మెట్‌ పెట్టుకోలేదన్న కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన పీయూష్‌ వర్ష్‌నే అనే వ్యక్తికి ఈ-చలాన్‌ ద్వారా రూ. 500 జరిమానా విధించారు. అయితే తాను కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ విధమైన చలాన్‌ రావడంతో అతడు కంగుతిన్నాడు. ఇక అప్పటి నుంచి కారులో కూడా హెల్మెట్‌ ధరించి ప్రయాణిస్తున్నాడు.

ఈ విషయం గురించి పీయూష్‌ మాట్లాడుతూ...‘అసలే పెరిగిన జరిమానాలతో భయంభయంగా గడుపుతున్నాం. మళ్లీ చలాన్‌ వస్తుందేమోనని భయంగా ఉంది. అందుకే కారులో వెళ్తున్నపుడు కూడా హెల్మెట్‌ పెట్టుకుంటున్నాను. హెల్మెట్‌ పెట్టుకోలేదన్న కారణంగా నా కారు నంబరు పేరిట గతంలో చలానా వచ్చింది. అప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటున్నా’ అని పేర్కొన్నాడు. కాగా ఈ విషయంపై స్పందించిన ట్రాఫిక్‌ ఎస్పీ.....‘డేటా తప్పిదాల వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కారు నంబరు ఆధారంగా చలాన్‌ను వెరిఫై చేసి ఒకవేళ నిజంగా హెల్మెట్‌ లేని కారణంగానే చలాన్‌ వెళ్లిందని తేలితే దానిని రద్దు చేస్తాం. ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడతాం’ అని వివరణ ఇచ్చారు. కాగా భారీ జరిమానాల కారణంగా పలువురు వాహనదారులు మోటార్‌ వాహన సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. 

చదవండి: ట్రాఫిక్‌ జరిమానాల ద్వారా రూ.72 లక్షలు

మరిన్ని వార్తలు