విద్యార్థినులు ఇక్కడొద్దు.. వాళ్లు ఆకర్షిస్తారు!

11 Nov, 2014 18:17 IST|Sakshi
విద్యార్థినులు ఇక్కడొద్దు.. వాళ్లు ఆకర్షిస్తారు!

ప్రఖ్యాతి చెందిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోని లైబ్రరీలో విద్యార్థినుల ప్రవేశాన్ని నిషేధించారు. అక్కడున్న మౌలానా ఆజాద్ లైబ్రరీలోకి తమనూ అనుమతించాలంటూ విద్యార్థినులు చేసిన డిమాండును వర్సిటీ వైస్ఛాన్స్లర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జమీరుద్దీన్ షా నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. వాళ్లను లోపలకు అనుమతిస్తే ఇప్పటివరకు వచ్చే కుర్రాళ్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువ మంది వస్తారని ఆయన అన్నారు. అయితే.. వీసీ నిర్ణయం దురదృష్టకరమని ఐద్వా ప్రధానకార్యదర్శి జగ్మతి సంగ్వాన్ అన్నారు. ఇలాంటి ప్రకటనలు ఇచ్చే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జమీరుద్దీన్ షా ప్రకటనను ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ బర్ఖా శుక్లా కూడా తీవ్రంగా విమర్శించారు. యూనివర్సిటీ ఆలోచనా విధానాన్ని ఈ ప్రకటన నిరూపిస్తోందని విమర్శించారు. అమ్మాయిలను లైబ్రరీలోకి అనుమతిస్తే ఎక్కువ మంది అబ్బాయిలు ఆకర్షితులవుతారని చెప్పడం వాళ్ల ఆలోచనల్లో తప్పును చూపిస్తోందన్నారు. అవసరమైతే మరింతమందిని అనుమతించేందుకు లైబ్రరీని విస్తరించాలి తప్ప.. మహిళలను ఇలా అణిచేయడం సరికాదన్నారు.

>
మరిన్ని వార్తలు