అల్‌కాయిదా కూడా కుట్రపన్నింది

13 Feb, 2016 00:15 IST|Sakshi
అల్‌కాయిదా కూడా కుట్రపన్నింది

ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్‌పై దాడి చేయాలనుకుంది
 
♦ సిద్ధి వినాయక ఆలయం, నేవల్ ఎయిర్ స్టేషన్, విమానాశ్రయం కూడా
♦ ముంబై దాడుల లక్ష్యాల్లో ఉండాలని ఐఎస్‌ఐ, లష్కరే భావించాయి
♦ 26/11 దాడులపై మరిన్ని సంచలనాలు వెల్లడిస్తున్న డేవిడ్ హెడ్లీ
 
 ముంబై: 26/11 ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించి ఇటీవలే అప్రూవర్‌గా మారిన ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ అమెరికా నుంచి వీడియో లింక్ ద్వారా ముంబైలోని ప్రత్యేక కోర్టుకు ఇస్తున్న వాంగ్మూలాల్లో నాలుగో రోజు శుక్రవారం మరిన్ని సంచలన అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌పై ఉగ్రదాడి చేయాలని అల్‌కాయిదా కూడా ఆసక్తి చూపిందని హెడ్లీ వెల్లడించారు. నేషనల్ డిఫెన్స్ కాలేజ్ లక్ష్యంగా దాడులు చేయాలని భావించిందన్నారు.

నిత్యం రద్దీగా ఉండే సిద్ధి వినాయక ఆలయం, నేవల్ ఎయిర్ స్టేషన్, విమానాశ్రయాలను ముంబై దాడుల్లో లక్ష్యంగా చేసుకోవాలని లష్కరే, ఐఎస్‌ఐ ఆలోచించాయని, అయితే, ఆయా ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టంగా ఉంటుందని చెప్పి తాను వారిని అడ్డుకున్నానని చెప్పారు. భవిష్యత్‌లో శివసేన భవన్‌పై దాడి చేయాలని కాని, ఆ పార్టీ అధినేత( నాటి పార్టీ అధ్యక్షుడు బాల్ ఠాక్రేనుద్దేశించి)ను హతమార్చాలని కానీ లష్కరే ఆలోచించే అవకాశముందనే అభిప్రాయంతో శివసేన నేత రాజారామ్ రెగెతో సన్నిహితం కావడం కోసం తాను ప్రయత్నించానన్నారు. ‘ముంబై మారణ హోమం తరువాత 2009 ఫిబ్రవరిలో అల్‌కాయిదా కీలక నేత ఇల్యాస్ కశ్మీరీని కలిశాను.

భారత్‌లో దాడులు చేయాలనుకుంటున్నామని, అందువల్ల మరోసారి ఇండియా వెళ్లాలని ఆయన నాకు సూచించారు. పలు ప్రాంతాలను.. ముఖ్యంగా ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్(ఎన్‌డీసీ)ని లక్ష్యంగా చేసుకోవాలనుకుంటున్నట్లు ఆయన నాకు చెప్పారు’ అని హెడ్లీ వెల్లడించారు. ఎన్‌డీసీని లక్ష్యంగా చేసుకోవడం వల్ల.. బ్రిగేడియర్ నుంచి జెనరల్ హోదాల వరకు.. అక్కడ ఉండే అనేకమంది సైన్యాధికారులను హతమార్చే అవకాశం ఉన్నందువల్ల వారికి అది ముఖ్యమైన లక్ష్యంగా మారిందని హెడ్లీ తెలిపారు. ‘ఎన్‌డీసీపై దాడి విజయవంతమైతే.. గతంలో భారత్, పాక్‌ల మధ్య జరిగిన యుద్ధాల్లో చనిపోయిన భారత సైన్యాధికారుల సంఖ్యను మించిపోయేలా మారణహోమం సృష్టించవచ్చని అల్‌కాయిదా మరో సభ్యుడు అబ్దుల్ రెహ్మాన్ పాషా నాకు వివరించారన్నారు.

 హెడ్లీ వెల్లడించిన మరికొన్ని అంశాలు..
► అల్‌కాయిదా నేత ఇల్యాస్ కశ్మీరీ ఆదేశాల మేరకు పుష్కర్, గోవా, పుణెల్లోని చాబాద్ హౌజ్‌ల వద్ద రెక్కీ నిర్వహించాను. ఎన్‌డీసీ తరువాత అవే అల్‌కాయిదా ముఖ్య లక్ష్యాలు.
► బార్క్(బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్)లోని కీలక, రహస్య సమాచారాన్ని అందించగల ఉద్యోగులను ఐఎస్‌ఐ కోసం రిక్రూట్ చేయాలని మేజర్ ఇక్బాల్ నన్ను ఆదేశించారు. 2008 జులైలో బార్క్‌లోనికి  వెళ్లి, ఆ ప్రాంగణాన్ని వీడియో తీసాను.
► ముంబైని మొత్తం సర్వే చేసిన తరువాత లష్కరే చీఫ్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, సాజిద్ మిర్, అబు కాఫా, అబ్దుల్ రెహ్మాన్ పాషా, మేజర్ ఇక్బాల్‌లను పాకిస్తాన్‌లో పలుమార్లు కలిశాను.
► ముంబై దాడులకు ముందు ముంబైలోని చాబాద్ హౌజ్ వద్ద రెక్కీ చేశాను. అందులో ఇజ్రాయెల్ పౌరులు, యూదులు ఉంటారని, అది ముఖ్యమైన లక్ష్యమని సాజిద్ మిర్, అబ్దుల్ రెహ్మాన్ పాషా చెప్పారు.
► ముంబై దాడుల్లో పాల్గొనే ఉగ్రవాదులకు సంబంధించి రెండు ప్రత్యామ్నాయాలపై ఆలోచన చేశారు. లక్ష్యాల వద్దకు చేరుకుని, చివరివరకు మారణహోమం సృష్టించడం ఒక ప్రత్యామ్నాయం(స్ట్రాంగ్‌హోల్డ్ ఆప్షన్) కాగా.. దాడుల అనంతరం తప్పించుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్లి, పోరాటం కొనసాగించడం(ఎగ్రెస్ ఆప్షన్) రెండో ప్రత్యామ్నాయం. అయితే మొదటిదాన్నే అమలు చేయాలని జకీ సాబ్(లష్కరే చీఫ్) ఆదేశించారు.
► దాడుల్లో పాల్గొంటున్న ఉగ్రవాదులకు ప్రత్యక్షంగా ఆదేశాలిచ్చేందుకు కరాచీలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

 డిగ్రీ పూర్తి చేసినందుకు కంగ్రాట్స్..
 26/11గురించి నా మొదటి భార్య షాజియాకు చెప్పాను. దాడుల అనంతరం శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ఈమెయిల్ చేసింది. ‘గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినందుకు కంగ్రాట్స్. కార్యక్రమం చాలా బాగా జరిగింది’ అని ఆమె కోడ్ బాషలో మెయిల్ చేసింది.  ‘థాంక్యూ జానూ.. ఈ మార్కులు సాధించేందుకు కష్టపడి చదివాను’ అని  రిప్లై ఇచ్చాను.
 
 వాంగ్మూలంపై వాగ్యుద్ధం..
 న్యూఢిల్లీ: గుజరాత్ పోలీసుల చేతిలో ఇషత్ ్రజహాన్ నకిలీ ఎన్‌కౌంటర్‌కు గురైందన్న వాదనకు వ్యతిరేకంగా.. ఆమె లష్కరే ఆత్మాహుతి దళ ఉగ్రవాది అంటూ హెడ్లీ స్పష్టం చేసిన నేపథ్యంలో..  బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య విమర్శనాస్త్రాల తీవ్రత పెరిగింది. భవిష్యత్తులో ప్రత్యర్థి కాగలడని ముందే ఊహించిన కాంగ్రెస్.. మోదీపై మొదట్నుంచీ ఉన్న వ్యతిరేకతతో వాస్తవాలకు మసిపూసిందని బీజేపీ ఆరోపించింది. దానిపై, ఉగ్రవాదుల మాటలను నమ్మడం బీజేపీ ఎప్పడ్నుంచి ప్రారంభించిందంటూ కాంగ్రెస్ తిప్పి కొట్టింది. హెడ్లీ వాంగ్మూలంతో ముంబై దాడుల్లో పాక్ పాత్ర పూర్తిగా బట్టబయలైందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు.పాక్‌లోని ఉగ్ర సంస్థలు శివసేనను శత్రువుగా భావించడం తమ పార్టీకి గర్వకారణమని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. శివసేన భవన్‌లోకి అనుమతించాలన్న డేవిడ్ హెడ్లీ అభ్యర్థనను అప్పుడే తోసిపుచ్చానని శివసేన మాజీ సభ్యుడు రాజారాం రెగే తెలిపారు.

మరిన్ని వార్తలు