ఏమీ లేదు.. స్కామే లేదు

22 Dec, 2017 01:19 IST|Sakshi

ఒక్క ఆధారం చూపలేకపోయిన ప్రాసిక్యూషన్‌..

‘2జీ’పై సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు

రాజా, కనిమొళి సహా 17 మందికి క్లీన్‌చిట్‌

కొందరు వివరాలను అటూఇటూ మార్చి కుంభకోణం ‘సృష్టించారు’

ఏడేళ్లుగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చున్నా ఒక్క ఆధారం చూపలేదు

చార్జిషీట్‌లో కూడా అవాస్తవాలున్నాయి

న్యాయమూర్తి ఓపీ సైనీ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 1.76 లక్షల కోట్ల స్కాం! స్వతంత్ర భారతదేశంలో ఇంతపెద్ద కుంభకోణమే లేదు.. ఇది అవినీతి విశ్వరూపం.. 2జీ స్కాంపై ఇన్నేళ్లుగా వినిపించిన ఆరోపణలివీ! ఈ కేసు ఓ సంచలనం.. గత ఎన్నికల్లో అధికారపక్షాన్ని కడిగేసేందుకు ప్రతిపక్షాలకు దొరికిన ప్రధాన అస్త్రం!! కానీ ఆ స్కామ్‌ అంతా ఉత్తిదే అని తేలిపోయింది. ఏమీ లేని చోట ‘స్కామ్‌’ను సృష్టించినట్లు స్పష్టమైంది. ఏడేళ్లపాటు ఈ కేసును సుదీర్ఘంగా విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ‘‘కొందరు కొన్ని వివరాలను తెలివిగా అటూఇటూ మార్చి ఏమీ లేని చోట స్కామ్‌ సృష్టించారు’’ అని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ ఉద్ఘాటించారు.

2జీకి సంబంధించి నమోదైన మూడు కేసుల్లో నిందితులపై ఒక్క అభియోగాన్ని కూడా ప్రాసిక్యూషన్‌ నిరూపించలేకపోయిందని, సరైన ఆధారం ఒక్కటి కూడా తమ ముందు ఉంచలేదని ఆయన స్పష్టంచేశారు. సీబీఐ నమోదు చేసిన ప్రధాన కేసులో టెలికం శాఖ మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా మొత్తం 17 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించారు. నిందితులపై నేరారోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్‌ దారుణంగా విఫలమైందని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 2జీ స్పెక్ట్రమ్‌ లైసెన్సుల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలతో ఖజానాకు రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందంటూ 2010లో కాగ్‌ నివేదిక ఇవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.

2008లో యూపీఏ ప్రభుత్వం ‘ముందొచ్చిన వారికి ముందు’ ప్రాతిపదికన 8 కంపెనీలకు 122 2జీ స్పెక్ట్రమ్‌ లైసెన్సులు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ విధానంతో ఖజానాకు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లిందని, లైసెన్సులు పొందినవారికి అనుచిత లబ్ధి చేకూరిందని కాగ్‌ నివేదిక ఇవ్వడంతో దేశంలో పెద్ద దుమారం రేగింది. మంత్రి పదవికి ఎ.రాజా రాజీనామా చేశారు. 2011లో ఆయన్ను సీబీఐ ఆరెస్ట్‌ చేసింది. 15 నెలలపాలు జైల్లో ఉన్నారు. ఇదే కేసులో డీఎంకే అధినేత కరుణానిధి తనయ కనిమొళికి కూడా ఆరు నెలలపాటు జైల్లో ఉన్నారు. 2012లో సుప్రీంకోర్టు సైతం 122 2జీ లైసెన్సులను రద్దు చేసింది.

ఒక్క ఆధారం చూపలేదు..
‘‘నిందితుల్లో ఒక్కరిపై కూడా ప్రాసిక్యూషన్‌ అభియోగాన్ని నిరూపించలేకపోయింది. ఈ విషయంలో దారుణంగా విఫలమైంది. నేను దాదాపు ఏడేళ్ల నుంచి వేసవి సెలవులతోపాటు అన్ని పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఓపిగ్గా వాదనలు విన్నా. ప్రాసిక్యూషన్‌ నుంచి ఒక్కరైనా చట్టం ముందు నిలిచే ఆధారాలు పట్టుకొస్తారని ఎదురుచూశా. కానీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది..’’ అని తన 2,183 పేజీల తీర్పులో న్యాయమూర్తి ఓపీ సైనీ వ్యాఖ్యానించారు. కోర్టుకు సమర్పించిన వివరాల్లో కూడా అనేక తప్పులున్నాయని చెప్పారు. కొందరు కొంత సమాచారాన్ని అటూఇటూ మార్చేసి లేని చోట కుంభకోణాన్ని సృష్టించారన్నారు. ‘‘చార్జిషీట్‌లో పేర్కొన్న అనేక వివరాలు కూడా చివరికి అవాస్తవాలని తేలాయి. ఆర్థిక శాఖ కార్యదర్శి ఎంట్రీ ఫీజును మార్చాలని సిఫారసు చేశారని, ఎల్‌వోఐ(లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌)లో ఓ క్లాజ్‌ను రాజా తొలగించారని చెప్పారు. కానీ విచారణలో అదంతా అవాస్తవమని తేలింది’’ అని వివరించారు.

3 కేసులు.. 35 మంది నిందితులు
సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం 2జీకి సంబంధించి మూడు కేసుల్లో తీర్పు చెప్పింది. ఇందులో పలు కంపెనీలు సహా మొత్తం 35 మంది నిందితులున్నారు. ఈ మూడింట్లో సీబీఐ దాఖలు చేసిన కేసు (17 మంది నిందితులు) ప్రధానమైనది. ఇందులో రాజా, కనిమొళితోపాటు టెలికం మాజీ కార్యదర్శి సిద్ధార్థ్‌ బెహురా, రాజా మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఆర్‌కే చందోలియా, స్వాన్‌ టెలికం ప్రమోటర్లు షాహిద్‌ ఉస్మాన్‌ బల్వా, వినోద్‌ గొయాంక, యునిటెక్‌ కంపెనీ ఎండీ సంజయ్‌ చంద్ర, రిలయెన్స్‌ అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్‌(ఆర్‌ఏడీఏజీ)కు చెందిన ముగ్గురు ఉన్నత ఉద్యోగులు గౌతమ్‌ దోషి, సురేంద్ర పిపరా, హరి నాయర్‌లను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది.

ఇక రెండో కేసు ఈడీ నమోదు చేసినది. రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ జరిగిందంటూ రాజా, కనిమొళిపై ఈడీ ఈ కేసు పెట్టింది. స్వాన్‌ టెలికం కంపెనీ ప్రమోటర్లు డీఎంకేకు చెందిన కలైంజర్‌ టీవీ చానల్‌కు ఈ మొత్తాన్ని లంచంగా ముట్టజెప్పినట్టు అభియోగం మోపింది. చార్జిషీట్‌లో డీఎంకే అధినేత కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్‌ పేరును కూడా చేర్చింది. ఇందులో రాజా, కనిమొళి సహా కుసేగావ్‌ ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటేబుల్స్‌ కంపెనీకి చెందిన రాజీవ్‌ అగర్వాల్, చిత్ర నిర్మాత కరీం మొరానీ, కలైంజర్‌ టీవీ డైరెక్టర్‌ శరద్‌ కుమార్, పి.అమృతం తదితరులను కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ప్రధాన కేసు దర్యాప్తు క్రమంలో సీబీఐ మూడో కేసు నమోదు చేసింది. ఇందులో ఎస్సార్‌ ప్రమోటర్లు రవికాంత్‌ రుయా, అన్షుమన్‌ రుయా సహా మరో ఆరుగురిని నిందితులుగా చేర్చినా.. కోర్టు వారని కూడా నిర్దోషులుగా తేల్చింది.

రాజకీయ చిటపటలు
తీర్పు వెలువడగానే రాజా, కనిమొళి హర్షం వ్యక్తంచేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ వాగ్బాణాలు సంధించుకున్నాయి. ఎట్టకేలకు న్యాయం నెగ్గిందని డీఎంకే పేర్కొనగా.. తీర్పుపై ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేయాలని ఈ కేసులో మొదట్నుంచీ న్యాయపోరాటం చేస్తున్న బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఇక 2జీపై నివేదిక ఇచ్చిన మాజీ కాగ్‌ వినోద్‌ రాయ్‌పై కాంగ్రెస్‌ నిప్పులు చెరిగింది. ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ డిమాండ్‌ చేశారు. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, బీజేపీ నేతలు జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కోర్టు తీర్పును గౌరవించాలని, తమ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలతో బురద చల్లినట్టు తేలిందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఈ తీర్పే అంతిమం కాదని, దీన్ని తమ నిజాయతీకి చిహ్నంగా కాంగ్రెస్‌ వాడుకోవద్దంటూ బీజేపీ దుయ్యబట్టింది.

అప్పీలు చేస్తాం: సీబీఐ, ఈడీ తమకు ఇంకా తీర్పు పూర్తి పాఠం అందలేదని, అది చేతికి రాగానే అధ్యయనం చేసి ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేస్తామని సీబీఐ, ఈడీ వెల్లడించాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు