ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష.. అందరూ ఫెయిల్‌!

22 Aug, 2018 14:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పనాజి : అకౌంటెంట్‌ పోస్టుల నియామకాల కోసం గోవా ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో ఒక్కరు కూడా అర్హత సాధించకపోవడం ప్రస్తుతం చర్చనీయాశంమైంది. సుమారు 8వేల మంది గ్రాడ్యుయేట్లు ఈ పరీక్ష రాయగా.. వీరిలో ఏ ఒక్కరికి 100కు కనీసం 50 మార్కులు రాలేదు. ఈ ఏడాది జనవరి 7న నిర్వహించిన ఈ పరీక్షలో ఒ‍క్కరు కూడా కనీస మార్కులు సాధించలేదని డైరెక్టరేట్‌ అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. 

గతేడాది అక్టోబర్‌లో 80 పోస్టులు నియమాకాల కోసం ప్రభుత్వం నోటీఫికేషన్‌ విడుదల చేసింది. ఇంగ్లీష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, అకౌంట్స్‌ సంబంధిత ప్రశ్నలతో 100 మార్కులకు ఐదు గంటల సమయంతో జనవరిలో పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో అర్హత సాధించినవారికి మౌఖిక ఇంటర్వ్యూల ద్వారా తుది జాబితాను ఎంపికచేస్తామని నోటీఫికేషన్‌లో పేర్కొంది. కానీ ఏ ఒక్కరు అర్హత సాధించకపోవడంతో అధికారులు నిశ్చేష్టులయ్యారు.  ఇక ఫలితాలను ఆలస్యం చేయడాన్ని గోవా ఆమ్‌ఆద్మీ పార్టీ నేత ప్రదీప్‌ పద్గోనకర్‌ తప్పుబట్టారు. 8000 మంది అభ్యర్థుల్లో ఏ ఒక్కరు అర్హత సాధించకపోవడం రాష్ట్రంలోని పతానవస్థలో ఉన్న విద్యావిధానానికి అద్దం పడుతోందని విమర్శించారు.

>
మరిన్ని వార్తలు