ముగిసిన అఖిలపక్ష భేటీ

10 Dec, 2018 11:35 IST|Sakshi
అఖిలపక్ష భేటీకి హాజరవుతున్న వైస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి

సాక్షి, న్యూఢిలీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్‌ లైబ్రరీ బిల్డింగ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్‌ లీడర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి హాజరయ్యారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా ప్రధాని విపక్ష నేతలను కోరారు. మంగళవారం నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా అదే రోజు అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనుండటం గమనార్హం. ఇక మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదానికి సహకరించాలని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో మహిళా బిల్లు ఆమోదానికి చర్యలు చేపట్టాలని కాంగ్రెస్‌ సీఎంలకు ఆయన లేఖ రాశారు.

మరోవైపు పార్లమెంట్‌ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ  పట్టుబట్టనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై హత్యాయ‍త్నం కేసును ఏపీ సర్కార్‌ నీరుగారుస్తున్న తీరు, తితిలీ తుపానులో నష్టపోయిన ఉత్తరాంధ్రకు ప్రత్యేక సాయం, సీబీఐ, ఈడీ వంటి సంస్ధలపై నిషేధం విధించి సమాఖ్య వ్యవస్థను చంద్రబాబు సర్కార్‌ ధిక్కరిస్తున్న వైనం, ఫిరాయింపుల చట్టం బలోపేతం, ఒకే దేశం-ఒకే ఓటు వంటి అంశాలను పార్లమెంట్‌ వేదికగా ఈ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ ప్రధానంగా ప్రస్తావించనుంది.

మరిన్ని వార్తలు