ఆ రైలంతా టికెట్‌ లేని ప్రయాణికులే..

1 Nov, 2017 20:19 IST|Sakshi

రామేశ్వరం : దాదాపు వెయ్యిమంది ప్రయాణికులు టికెట్‌ లేకుండానే రైలు ప్రయాణం చేసేశారు. టికెట్‌ కౌంటర్‌లో ఉద్యోగులెవరూ లేకపోవటమే ఇందుకు కారణం. తమిళనాడులోని రామేశ్వరం- మదురై ప్యాసింజర్‌ ట్రెయిన్‌ నిత్యం ఉదయం 5.30 గంటల సమయంలో రామేశ్వరం నుంచి బయలుదేరుతుంది. ఇందుకోసం పెద్ద సంఖ్యలో జనం స్టేషన్‌కు చేరుకుని కౌంటర్‌ వద్ద క్యూ కట్టారు. అయితే, రైలు బయలుదేరే సమయం దగ్గరపడుతున్నా సంబంధిత ఉద్యోగులెవరూ లేకపోవటంతో ప్రయాణికులంతా రైలెక్కేశారు. గమ్యస్థానాలకు చేరుకున్నారు. టికెట్‌ కౌంటర్లో ఉండాల్సిన ఉద్యోగి రాకపోవటంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమయినట్లు తెలుస్తోంది. దీనిపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. మధురై-రామేశ్వరం మధ్య దూరం 161 కిలోమీటర్లు కాగా బుధవారం రైలులో సుమారు వెయ్యిమంది ఉచితంగా ప్రయాణించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు