గుజరాత్‌ తొలిదశ నేడే

9 Dec, 2017 02:33 IST|Sakshi

89 స్థానాల్లో పోలింగ్‌..

సూరత్‌లో తెలుగు ఓటర్లు కీలకం  

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో శనివారం జరగనున్న తొలిదశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దక్షిణ గుజరాత్, సౌరాష్ట్రల్లోని 89 నియోజకవర్గాల్లో మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. 2.12 కోట్ల మంది ఓటర్లు శనివారం తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 977 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఐదోసారీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ, 22 ఏళ్ల అధికార వనవాసానికి ముగింపు పలకాలని కాంగ్రెస్‌ భావిస్తుండటంతో ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మకం కాగా, కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న రాహుల్‌ గాంధీ పనితీరుకు ఈ ఎన్నికలు పరీక్షగా నిలిచాయి. ఈ దశ ఎన్నికల్లో గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ (రాజ్‌కోట్‌), కాంగ్రెస్‌ హేమాహేమీలు శక్తిసింగ్‌ గోహిల్‌ (మాండ్వి), పరేశ్‌ ధనానీ (అమ్రేలీ)లు వంటి ప్రముఖులు బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో సూరత్‌ నగరం పరిధిలోని 12 స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. అయితే ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ తప్పదని క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి తెలుస్తోంది. సూరత్‌లోని రెండు నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు కీలకంగా మారారు.

‘నవ గుజరాత్‌’ హామీతో బీజేపీ మేనిఫెస్టో
♦ ఎన్నికకు ఒకరోజు ముందు విడుదల
♦ సమగ్రాభివృద్ధి, విద్య, వైద్యం, పేదల సంక్షేమంపై హామీలు

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ తొలిదశ ఎన్నికలకు ముందురోజు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేయటంతోపాటు వివిధ సామాజిక వర్గాలకు భరోసా ఇస్తూ ‘నవ గుజరాత్‌’ నిర్మాణమే లక్ష్యమని శుక్రవారం విడుదల చేసిన మేనిఫెస్టోలో పేర్కొంది. బీజేపీ నేతృత్వంలో గుజరాత్‌ వృద్ధిరేటు 10 శాతానికి పెరగటాన్ని దృష్టిలో ఉంచుకుని.. మరింత అభివృద్ధి దిశలో రాష్ట్రం దూసుకెళ్లేలా మేనిఫెస్టోను రూపొందించినట్లు ఈ సందర్భంగా గుజరాత్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌ అరుణ్‌ జైట్లీ వెల్లడించారు.

భారీ హామీలు ఇవ్వకుండా.. సమగ్రాభివృద్ధి, కీలక తీర్మానాలపైనే బీజేపీ దృష్టి సారించింది. తక్కువ ధరకే ఎరువులు, విత్తనాలు, సరైన నీటిపారుదల వ్యవస్థ, కనీస మద్దతు ధర వంటి ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని పేర్కొంది. విద్యా ప్రమాణాలను మెరుగుపరచటం, వైద్యరంగంలో సంస్కరణలు, ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం వంటి అంశాలను ప్రత్యేకంగా పేర్కొంది. ఠాకూర్, కోలి అభివృద్ధి బోర్డులకు నిధుల రెట్టింపు, ఎస్సీ విద్యార్థులకు కొత్త హాస్టళ్లనూ మేనిఫెస్టోలో చేర్చారు. కాంగ్రెస్‌ హామీలేవీ ఆర్థికంగా, రాజ్యాంగ పరంగా అమలుకాలేదని జైట్లీ విమర్శించారు. 

మరిన్ని వార్తలు