'పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయొద్దు'

16 Aug, 2016 15:41 IST|Sakshi
'పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయొద్దు'

న్యూఢిల్లీ: బలూచిస్తాన్, గిల్జిత్ అంశాలపై ఒకే విధమైన వైఖరి ప్రకటించాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు కోరారు. దేశ ప్రయోజనాలు దెబ్బతినేలా ప్రకటనలు చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ.. బలూచిస్తాన్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ విడుదల చేసిన ప్రకటనపై వెంకయ్య స్పందించారు.

అంతర్జాతీయ అంశాలపై దేశం యావత్తు ఒకే గళం వినిపించాల్సిన అవసరముందన్నారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ భిన్నమైన వైఖరి కనబరుస్తోందని ఆయన విమర్శించారు. బలూచిస్తాన్ అంశంపై కాంగ్రెస్ నాయకులు సల్మాన్ ఖుర్షీద్, కపిల్ సిబల్, రణదీప్ సుర్జీవాలా చేసిన ప్రకటనలు పరస్పర విరుద్దంగా ఉన్నాయని తెలిపారు. ఇలాంటి అంశాలపై మాట్లాడేటప్పుడు ముందువెనుక ఆలోచించాలని హితవు పలికారు.

పొరుగుదేశం తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో మనదేశంలోని అన్ని పార్టీలు ఒకే గొంతు వినిపించాల్సిన అవసరముందన్నారు. ఇండియాలో కశ్మీర్ అంతర్భాగమని పునరుద్ఘాటించారు. కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ కు ప్రధాని మోదీ గట్టి సందేశం పంపారని వెంకయ్య నాయుడు అన్నారు.
 

మరిన్ని వార్తలు