మెరిసేదంతా బంగారం కాదు!

6 May, 2016 18:21 IST|Sakshi
మెరిసేదంతా బంగారం కాదు!

► ఆభరణాల కొనుగోళ్లలో జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు
► బంగారం స్వచ్ఛత చూసి ధర చెల్లించాలి
► మేకింగ్ చార్జీలు, స్టోన్ చార్జీలపై అప్రమత్తత అవసరం
► ‘అక్షయ తృతీయ’ సందర్భంగా ప్రత్యేక కథనం

 
సాక్షి, బెంగళూరు: అక్షయ తృతీయత రోజున బంగారాన్ని కొంటే ఇంట సిరులు కురిపించే మహాలక్ష్మి చల్లని చూపులకు పాత్రులు కావచ్చని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే ఆ రోజున ఒక గ్రాము బంగారాన్నైనా ఖరీదు చేయాలని తహతహలాడుతుంటారు. దీంతో మామూలు రోజుల్లో కంటే అక్షయ తృతీయ జరుపుకునే రెండు రోజులు బంగారం మార్కెట్లు కొనుగోలుదారులతో కళకళలాడుతుంటాయి.

ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా అక్షయ తృతీయకు  ముందునుంచే వినియోగదారులు బంగారం కోసం నగల సంస్థల్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. మరో వైపు అక్షయ తృతీయ మార్కెట్ను తమ వైపునకు తిప్పుకోవడానికి నగరంలోని అనేక నగల వ్యాపార సంస్థలు  ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి. అయితే అత్యంత ఖరీదైన బంగారాన్ని, రేటు పెరగడమే తప్ప తగ్గడం తెలియని వజ్రాన్ని కొనేటపుడు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే వ్యాపారుల చేతుల్లో మోసపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంస్థలు ప్రకటించే ఆఫర్లను చూసి కాకుండా, మనం కొనుగోలు చేసే బంగారం స్వచ్ఛత చూసి రేటు చెల్లించాలని చెబుతున్నారు. ఈనెల 9న అక్షయ తృతీయ సందర్భంగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రత్యేక కథనం.
 
హాల్మార్క్ని ఇలా గుర్తించండి..

బంగారం స్వచ్ఛతను తెలియజేయడానికి బీఐఎస్(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) నిర్ణయించిందే హాల్మార్క్.  ప్రతి నగల దుకాణం హాల్మార్క్ నగలనే విక్రయించాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. బీఐఎస్లో రిజిస్టర్ అయిన నగల దుకాణాలాకు హాల్మార్క్ పొందే సౌకర్యం ఉంటుంది. తయారీ సంస్థలు తాము రూపొందించిన నగల స్వచ్ఛతను పరీక్షించడానికి నగలన్నింటిని బీఐఎస్కి పంపుతారు. అక్కడి అధికారులు నగ స్వచ్ఛతను పరీక్షించి హాల్మార్క్ ఇస్తారు. ఇందులో మళ్లీ కొన్ని దుకాణాలు 80శాతం హాల్మార్క్ అని, 75శాతం హాల్మార్క్ నగలనీ విక్రయిస్తుంటాయి. అయితే ఖరీదు చేయాల్సింది 100శాతం హాల్మార్క్ పొందిన నగలను మాత్రమే.
 
100శాతం హాల్మార్క్ ఉండాలంటే..
100శాతం హాల్మార్క్ను బీఐఎస్ నుంచి పొందిన నగలను మాత్రమే పూర్తి స్వచ్ఛమైన నగలుగా పరిగణించాలి. ఈ విధంగా బీఐఎస్ గుర్తించాలంటే బంగారం 91.6శాతం స్వచ్ఛంగా ఉండాలి. 91.59శాతం స్వచ్ఛత కలిగి ఉన్నా హాల్మార్క్ పొందలేము. 91.6శాతం స్వచ్ఛత కూడా నగలా ఉన్నపుడు కాకుండా నగను కరిగించిన తరువాత ఉండాలి. అపుడే మనం చెల్లిస్తున్న డబ్బుకు సరైన బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు లెక్క. అందుకే నగల తయారీ సంస్థలు పంపిన నగల నుంచి కొన్ని శాంపిల్లను బీఐఎస్ వేరుచేసి వాటిని కరిగించి చూస్తుంది. వాటిలో 91.6శాతం బంగారం, మిగతా 8.4శాతం సిల్వర్, అలాయ్(కొన్ని రకాల లోహాలు కలవడం వల్ల ఏర్పడిన మిశ్రమం)లు ఉంటేనే వాటికి 91.6 హాల్మార్క్ లభిస్తుంది. ఈ విధంగా హాల్మార్క్ను అందించడానికి ప్రభుత్వం ఎటువంటి చార్జీలను అదనంగా వసూలు చేయదన్న విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది. ఈ 91.6 శాతమే వాడుకలో 916గా మారిపోయింది.                                               
 
కేడీఎం అంటే...
కేడీఎం అనేది బంగారం స్వచ్ఛతను తెలిపే ఒక మాపనంగా చాలా మంది భావిస్తుంటారు. అయితే కేడీఎం అంటే క్యాడ్మియం అనే లోహం మాత్రమే. పాత కాలంలో అలాం అనే లోహంతో ఒక నగకు కావలసిన రూపాన్ని, అందుకు కావాల్సిన సాల్డరింగ్స్ని( అతుకు వేయడానికి) చేసేవారు. దీని మూలంగా బంగారంలో ఎక్కువ శాతం అలాం కలిసిపోయి బంగారం స్వచ్ఛత తగ్గుతూ వచ్చేది.   ప్రస్తుతం క్యాడ్మియంతో సాల్డరింగ్ నిర్వహిస్తున్నారు. ఇది అతుకు వేస్తుందే తప్ప బంగారంలో కలవదు. అందుకే క్యాడ్మియంతో సాల్డరింగ్ చేసిన బంగారు నగల స్వచ్ఛత ఏమాత్రం తగ్గదు. ఈ విషయంపై అవగాహన లేని చాలా మంది కేడీఎం అనగానే స్వచ్ఛతను తెలియజేస్తుందని, 916 కేడీఎం అంటే చాలా స్వచ్ఛతను కలిగిన బంగారంగా భావించి మోసపోతుంటారని నగరంలోని ఓ ప్రముఖ జువెలరీ సంస్ధ నిర్వాహకులు మధుకర్ వెల్లడించారు.
 
మేకింగ్ చార్జీలతో జర భద్రం..

బంగారం కొనుగోలులో వినియోగదారుడు ఎక్కువగా మోసపోవడానికి అవకాశమున్నది మేకింగ్ చార్జీల అంశంలో. ఈ చార్జీలు ఒక్కో నగల షోరూంకు ఒక్కో విధంగా ఉంటూ ఉంటాయి. డిజైన్, నగ బరువును అనుసరించి గ్రాముకు 100నుంచి 500వరకు మేకింగ్ చార్జీలను నగల తయారీ సంస్థలు వసూలు చేస్తుంటాయి. బంగారం ధరలో 25శాతం వరకు మేకింగ్ చార్జీల పేరుతో వినియోగదారులు చెల్లించాల్సి వస్తోంది. అయితే అక్షయ తృతీయ సీజన్ అనగానే నగల తయారీ సంస్థలన్నీ మేకింగ్ చార్జీలను తగ్గిస్తున్నామంటూ ప్రకటనలను గుప్పిస్తుంటాయి. ఈ చార్జీలు, స్టోన్ చార్జీల వద్దే వినియోగదారులు అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుందని రాజ్ డైమండ్స్ ఎండీ నితిన్ బెతలా చెబుతున్నారు.

‘అక్షయ తృతీయ సీజన్లో మేకింగ్ చార్జీల తగ్గింపు అన్న మాటవినగానే చాలా మంది ఎటువంటి బంగారాన్ని విక్రయిస్తున్నారన్న విషయం తెలుసుకోకుండానే కొనుగోలు చేస్తుంటారు. వీటి వల్ల వినియోగదారులు చాలా మోసపోయే అవకాశం ఉంది. అందులోను ఈ మోసం వజ్రాల నగల్లో అధికంగా ఉంటుంది. వజ్రానికి ఇదే రేటు అని మార్కెట్లో స్థిరంగా ఉండదు కాబట్టి మేకింగ్ చార్జీలను తగ్గించామని చెబుతూ, వజ్రం ధరని రెట్టింపు చేసి అమ్ముతుంటారు. ఉదాహరణకు ఇవాల్టి ఒక క్యారట్ వజ్రం ధర రూ.60వేలు అయితే మేకింగ్ చార్జీ ఫ్రీ అంటూ అదే వజ్రాన్ని రూ.80వేలకు అందిస్తారు. కాబట్టి ఈ మేకింగ్ చార్జీల విషయంలో గందరగోళానికి గురికాకుండా మీరు కొనే బంగారం స్వచ్ఛత, వజ్రం నాణ్యతలపై దృష్టి సారించాలి’అని నితిన్ తెలిపారు.

మరిన్ని వార్తలు