అలహాబాద్‌.. ఇకపై ప్రయాగ్‌రాజ్‌!

16 Oct, 2018 04:43 IST|Sakshi

అలహాబాద్‌: చారిత్రక నగరం అలహాబాద్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై సీఎం ఆదిత్యనాథ్‌ మాట్లాడారు. విస్తృత ఏకాభిప్రాయం తర్వాతే అలహాబాద్‌ పేరును మారుస్తాం. ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలన్నది ఎక్కువ మంది ప్రజల ఆకాంక్ష. అందరూ అంగీకరిస్తే ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తాం’ అని తెలిపారు. ఈ మేరకు సీఎం పంపించిన ప్రతిపాదనలకు గవర్నర్‌తో పాటు కేంద్రం కూడా ఆమోద ముద్ర వేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఇక్కడ జరగనున్న కుంభమేళాకు ముందుగానే కొత్తపేరు ప్రయాగ్‌రాజ్‌ను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. 16వ శతాబ్దంలో మొఘలు చక్రవర్తి అక్బర్‌ ఇక్కడి గంగా–యమున కలిసే సంగమ ప్రాంతంలో కోటను నిర్మించాడు. ఆ కోటకు, పరిసర ప్రాంతానికి కలిపి ఇలాహాబాద్‌ అని పేరు పెట్టాడు. కుంభమేళా జరిగే సంగమ ప్రాంతాన్ని ప్రయాగ్‌ అనే పేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు.

మరిన్ని వార్తలు