‘షేమ్‌’ హోర్డింగ్స్‌పై స్పందించిన కోర్టు

8 Mar, 2020 17:13 IST|Sakshi

లక్నో : సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పేర్లు, చిరునామాలతో కూడిన హోర్డింగ్‌లను యూపీ ప్రభుత్వం ప్రదర్శించడంపై అలహాబాద్‌ హైకోర్టు సుమోటోగా స్పందించింది. ఈ అంశంపై ఆదివారం ఉదయం విచారణ చేపడతామని వెల్లడించిన అలహాబాద్‌ హైకోర్టు ప్రభుత్వ సూచన మేరకు మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేసింది. పౌరుల స్వేచ్ఛను హరిస్తూ వారి వ్యక్తిగత వ్యవహారాల్లోకి ప్రభుత్వం వెళ్లడం తగదని, విచారణ ప్రారంభమయ్యేలోగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గోవింద్‌ మాధుర్‌ అన్నారు.

సీఏఏ వ్యతిరేక నిరసనల్లో హింసకు పాల్పడిన వారి ఫోటోలు, చిరునామాలతో కూడిన హోర్డింగ్‌లను యూపీ ప్రభుత్వం లక్నో వీధుల్లో ఏర్పాటు చేయడం వివాదాస్పదమైన సం‍్గతి తెలిసిందే. హింసకాండ ద్వారా వాటిల్లిన నష్టాన్ని నిందితులు భర్తీ చేయని పక్షంలో వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని కూడా హోర్డింగ్స్‌లో ప్రభుత్వం పేర్కొంది. వ్యక్తిగత ఆస్తుల అటాచ్‌మెంట్‌ నోటీసులు కూడా ఇప్పటికే పలువురు నిందితులకు ప్రభుత్వం జారీ చేసింది.

విస్త్రృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిబంధనలకు అనుగుణంగానే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని యూపీ సీఎం కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తమ స్వేచ్ఛను హరిస్తూ జైలులో నిర్బంధించి వేధింపులకు గురిచేస్తున్నారని నిందితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా హోర్డింగ్‌ల్లో ప్రస్తావించిన నిందితుల పేర్లలో రాజకీయ కార్యకర్త సదాఫ్‌ జాఫర్‌, న్యాయవాది మహ్మద్‌ షోయబ్‌, నాటకరంగ ప్రముఖులు దీపక్‌ కబీర్‌, మాజీ ఐపీఎస్‌ అధికారి ఎస్‌ఆర్‌ దారాపురి తదితరులున్నారు. కాగా ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైన వీరంతా తమ ఆస్తులను అటాచ్‌ చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తే కోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నారు.

చదవండి : సీఏఏ అంటే రాజ్యాంగంపై దాడే

మరిన్ని వార్తలు