ఆ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన హైకోర్టు

12 Dec, 2016 15:07 IST|Sakshi
ఆ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన హైకోర్టు

న్యూఢిల్లీ:
మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భర్త లేక భర్య తమ సహచరులపై చేసే తప్పుడు ఆరోపణలు అత్యంత బాధాకరమైనవని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఓ భర్త పెట్టుకున్న వివాహరద్దు పిటిషన్ను విచారించిన కోర్టు గురువారం డైవర్స్ మంజూరు చేసింది. నిరాధారమైన వివాహేతర సంబంధం ఆరోపణలు క్రూరత్వాన్ని తెలియజేస్తాయని జస్టిస్ ప్రదీప్ నంద్రాజోగ్, జస్టిస్ యోగేష్ కన్నాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం, వరకట్న వేధింపులు వంటి తప్పుడు ఆరోపణలతో సదరు మహిళ తన భర్తను ఇబ్బందిపెట్టినట్టు కోర్టు భావించింది. దంపతుల మధ్య వివాహేతర సంబంధం ఆరోపణలకు మించి బాధాకరమైన విషయం మరోకటి ఉండదని ధర్మాసనం తెలిపింది.

డైవర్స్ కోసం ట్రయల్ కోర్టులో పెట్టుకున్న తన పిటిషన్ను తోసిపుచ్చడంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. భార్యా, భర్తలు ఇద్దరు 1995 నుంచి విడివిడిగా ఉండటం, భార్య ప్రవర్తించిన తీరువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని హైకోర్టు సదరు వ్యక్తికి డైవర్స్ మంజూరు చేసింది.   

1995 ఫిబ్రవరిలో ఇరువరి పెళ్లి జరిగింది. అయితే భార్య తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో 1996లో ట్రయల్ కోర్టులో డైవర్స్ కోసం అప్పీల్ చేసుకున్నాడు. 2001లో ఆమె తనతో స్నేహపూర్వకంగా ఉంటానని హామీ ఇవ్వడంతో తన డైవర్స్ పిటిషన్ను ఉపసంహరించుకున్నాడు.

1995లో ఆమె తన కుటుంబసభ్యుల దగ్గరకు వెళ్లినప్పటి నుంచి తన వద్దకు తిరిగి రాకపోవడంతో తిరిగి 2009లో మళ్లీ డైవర్స్ పిటిషన్ వేశానని  హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చాడు. ట్రయల్ కోర్టులో విచారణ సమయంలో తన భర్త మరో యువతితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని లిఖిత పూర్వకంగా ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొంది. అంతే కాకుండా కట్నం కోసం తనను వేధించేవాడని తెలిపింది. అయితే వరకట్న వేధింపుల కేసులో కోర్టు అతన్ని నిర్దోషిగా తేల్చింది. కానీ, అతను డైవర్స్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ సదరు వ్యక్తి హైకోర్టు ఆశ్రయించడంతో డైవర్స్ మంజూరు చేసింది.

మరిన్ని వార్తలు