ఆ అక్కాచెల్లెళ్లు నిత్యానంద ‘కైలాస’లో..

2 Jul, 2020 15:47 IST|Sakshi

నిత్యానంద ఆశ్రమం నుంచి మిస్సయిన అక్కాచెల్లెళ్లు

కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

అహ్మదాబాద్‌: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఆశ్రమంలో చేరి కనిపించకుండా పోయిన అక్కాచెల్లెళ్లు ప్రస్తుతం.. ‘‘కైలాస’’లో ఉన్నట్లు తెలిసిందని గుజరాత్‌ పోలీసులు వెల్లడించారు. భారత- కరేబియన్‌ సంస్కృతుల మేళవింపుతో కూడిన ‘చట్నీ మ్యూజిక్‌’ అనే కళను అభ్యసిస్తూ.. వారిద్దరు అక్కడ ప్రదర్శనలు కూడా ఇస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. అదే విధంగా కరేబియన్‌ దీవుల్లో నిత్యానంద కొనుగోలు చేసిన ‘కైలాస’ నిర్వహణ బాధ్యతల్లో కూడా పాలుపంచుకుంటున్నట్లు తెలిసిందన్నారు. కాగా కర్ణాటకకు చెందిన జనార్థన శర్మ కూతుళ్లే ఈ అక్కాచెల్లెళ్లు. శర్మకు నలుగురు కూతుళ్లు ఉండగా.. 2013లో వీరిని నిత్యానంద ఆశ్రమానికి చెందిన విద్యా సంస్థలో చేర్పించారు.(నిత్యానంద దేశం.. కైలాస!)

ఈ క్రమంలో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే వారిని 2019లో అహ్మదాబాద్‌లో ఉన్న యోగిని సర్వజ్ఞాన పీఠానికి పంపించారు. విషయం తెలుసుకున్న శర్మ దంపతులు.. అహ్మదాబాద్‌ ఆశ్రమానికి వెళ్లగా నిర్వాహకులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులను ఆశ్రయించిన బాధితులు.. వారి సాయంతో లోపల ప్రవేశించి తమ ఇద్దరు మైనర్‌ కూతుళ్లను ఇంటికి తీసుకురాగా.. మేజర్లైన మరో ఇద్దరు కూతుళ్లు లోముద్ర శర్మ(21), నందిత(18) వారితో వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో బెదిరింపులకు లొంగి ఆశ్రమంలో ఉండిపోయిన.. తమ ఇద్దరు కూతుళ్లను అప్పగించాలని కోరుతూ శర్మ దంపతులు గుజరాత్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో నిత్యానంద వారిని విదేశాలకు తీసుకువెళ్లినట్లు తాజా సమాచారం ద్వారా వెల్లడైంది.(నిత్యానందకు నోటీసులపై వింత జవాబు)

ఈ విషయం గురించి ఓ పోలీసు ఉన్నతాధికారి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘నిత్యానందకు వ్యతిరేకంగా ఇంతవరకు మేము రెడ్‌ కార్నర్‌ నోటీసు పొందలేకపోయాం. ఇప్పుడు వాళ్లు ఒకవేళ కైలాసలో ఉన్న విషయం నిజమే అయినా.. వారిని ఎలా వెనక్కి తీసుకురావాలో అర్థం కావడంలేదు. అప్పగింత ఒప్పందం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని భావించినా.. ఏ దేశంతో ఈ మేరకు సంప్రదింపులు జరపాలో అన్న విషయంపై స్పష్టత లేదు’’అని  వాపోయారు. కాగా ఆధ్మాత్మికత ముసుగులో మహిళలపై అకృత్యాలకు పాల్పడిన నిత్యానంద దేశాన్ని విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఈక్వెడార్‌ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి ‘కైలాస’ అనే పేరు కూడా పెట్టినట్లు వెల్లడించాడు. అంతేగాక తన దేశానికి ఒక పాస్‌పోర్ట్‌, జెండా, జాతీయ చిహ్నాన్ని డిజైన్‌ చేసినట్లు పేర్కొన్నాడు. అదే విధంగా ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేసి పాలన చేస్తున్నట్లు వెల్లడించాడు.

మరిన్ని వార్తలు