పౌర వాహనాలను రానివ్వడంతోనే..

16 Feb, 2019 04:54 IST|Sakshi

దాడి చేయగలిగారన్న సీఆర్‌పీఎఫ్‌

జమ్మూ–శ్రీనగర్‌ జాతీయ రహదారిపై సైనికులు ప్రయాణిస్తున్న సమయంలో పౌరుల వాహనాలనూ అనుమతించడంతో దాడి సాధ్యమైందని సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సైనికులు రాకపోకలు సాగించే మార్గాన్ని ముందుగా రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీ(ఆర్‌వోపీ) తనిఖీ చేస్తుంది. దారిలో మందుపాతరలు, బాంబులు ఉన్నాయేమో తనిఖీ చేయడం ఈ పార్టీ పని. మరో బృందం దారి పక్కన పొంచి ఉండి ఉగ్రవాదులు కాల్పులు జరిపే లేదా బాంబు దాడి చేసే అవకాశాలను పరిశీలిస్తుంది. తర్వాతే సైనికుల రాకపోకలకు అనుమతిస్తారు. ఈ తనిఖీల్లో ప్రజలు  వాడే వాహనాలను పెద్దగా పట్టించుకోరు. వాటి రాకపోకలకు అభ్యంతరాలు చెప్పరు.

గురువారం జమ్ము–శ్రీనగర్‌ జాతీయ రహదారిని క్షుణ్ణంగా పరిశీలించాకే సైనిక వాహనాలకు ఉత్తర్వులిచ్చారు. చుట్టు పక్కల గ్రామాలను జాతీయ రహదారితో అనుసంధానిస్తూ సర్వీసు రోడ్లు ఉన్నాయి. స్థానికులు వాటి ద్వారా వాహనాల్లో జాతీయ రహదారిపై వస్తూ పోతూ ఉంటారు. ప్రతిసారీ తనిఖీ చేయడం వారికి ఇబ్బందిగా ఉంటుందన్న భావనతో సైన్యం వారి రాకపోకలను పట్టించుకోదు. జైషే ఉగ్రవాది ఆదిల్‌ ఇదే అవకాశాన్ని వాడుకున్నాడు. పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సర్వీసు రోడ్డుపై వేచి ఉండి సైనికుల వాహన శ్రేణి కనిపించగానే జాతీయ రహదారిపైకి దూసుకొచ్చాడు.

హిమపాతం కారణంగా ఆరు రోజులుగా మూసి ఉన్న జమ్మూ– శ్రీనగర్‌ జాతీయ రహదారిని గురువారం తెరవడంతో సాధారణం కంటే రద్దీ ఎక్కువగానే ఉందని సైనికాధికారులు తెలిపారు. ఉగ్రవాదులు ఐఈడీ దాడులు చేసే అవకాశం ఉందంటూ ఈ నెల 8వ తేదీన ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో అదనపు జాగ్రత్తలు కూడా తీసుకున్నామని, అయినా ఇలా జరగడం ఆశ్చర్యంగా ఉందని సీఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఆపరేషన్స్‌) జుల్ఫికర్‌ హసన్‌ చెప్పారు. ‘ఆ ఉగ్రవాది తన వాహనంలో చాలా దూరం నుంచి వస్తూ ఉండి ఉంటే దారిలో ఎక్కడో అక్కడ తనిఖీ పాయింట్‌లో దొరికేవాడు’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో అధికారి చెప్పారు. ఈ అనుభవంతో ఇకపై సైనికులు ప్రయాణించే సమయంలో జాతీయ రహదారిపై పౌరులకు అనుమతించకుండా ఉండాలని ఆయన అన్నారు.

ప్రతీకారం తప్పదు: సీఆర్పీఎఫ్‌
జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను క్షమించం, ప్రతీకారం తీర్చుకుంటాం’ అని సీఆర్పీఎఫ్‌ ప్రతినబూనింది. దేశంలోని అతిపెద్ద పారామిలటరీ బలగం సీఆర్పీఎఫ్‌ శుక్రవారం ట్విట్టర్‌లో ‘ ఉగ్రవాదులను క్షమించబోం. పుల్వామా దాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు వందనం. అమరుల కుటుంబాలకు తోడుగా ఉంటాం. హేయమైన ఈ దాడికి మూల్యం తప్పదు’ అని పేర్కొంది. అమర జవాన్ల స్మృత్యర్థం సీఆర్పీఎఫ్‌ కేంద్ర కార్యాలయంలో జెండాను అవనతం చేయడంతోపాటు రెండు నిమిషాలు మౌనం పాటించినట్లు తెలిపింది. కశ్మీర్‌లో ఉగ్రవాదులు, వేర్పాటు వాదులతో జరిగే పోరులో 3.60 లక్షల మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది పాల్గొంటున్నారు.

సైన్యం వెళ్లే సమయంలో పౌర వాహనాల నిలిపివేత

కశ్మీర్‌ రోడ్లపై అమలు: రాజ్‌నాథ్‌
శ్రీనగర్‌: కశ్మీర్‌లో ఇకపై ప్రధాన రహదారులపై సైనిక, భద్రతా దళాల వాహన శ్రేణులు వెళ్తున్నప్పుడు సాధారణ పౌరుల వాహనాలను కొద్దిసేపు నిలిపేస్తామని హోం మంత్రి రాజ్‌నాథ్‌  ప్రకటించారు. దాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో రాజ్‌నాథ్‌ పర్యటించారు. భద్రతా దళాల వాహన శ్రేణులు వెళ్తున్న సమయంలో పౌరుల వాహనాలను నిలిపేయడం ఇబ్బందిని కలిగించే చర్యేననీ, కానీ జవాన్ల భద్రత కోసం ఇది తప్పదని ఆయన పేర్కొన్నారు. తర్వాత రాజ్‌నాథ్‌ సీఆర్‌పీఎఫ్‌ క్యాంపస్‌కు చేరుకున్నారు. సైనికుల భౌతిక కాయాలకు నివాళులర్పించారు. ఓ జవాన్‌ భౌతిక కాయాన్ని విమానంలోకి ఎక్కిస్తుండగా, ఆ శవపేటికను రాజ్‌నాథ్‌ తన భుజాలపై మోశారు.

మరిన్ని వార్తలు